
డెంగీ డేంజర్ బెల్స్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 18 వరకు 56 డెంగీ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోనే 28వరకు కేసులు అంటే దాదాపు 50 శాతం కేసులు ఉండడం నగరవాసులను కలవరానికి గురిచేస్తోంది. అలాగే జిల్లావ్యాప్తంగా ఒక్క ఆగస్టులోనే 18వరకు డెంగీ కేసులు వస్తే వీటిలో తొమ్మిది కేసులు వరంగల్ నగరం నుంచే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వరంగల్ నగరంలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉండడంతో దోమలు విజృంభించి వ్యాధి వ్యాప్తి ఎక్కువవుతోంది.
గ్రేటర్‌లో హాట్ స్పాట్‌లు ఎక్కడంటే..
వరంగల్ నగరంలో కీర్తినగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో అత్యధికంగా ఆరు డెంగీ కేసులు నమోదయ్యాయి. దేశాయిపేట యూపీహెచ్‌సీలో మూడు, ఫోర్ట్ వరంగల్ యూపీహెచ్‌సీలో రెండు, రంగశాయిపేట యూపీహెచ్‌సీలో రెండు, ఎంజీఎంలో మూడు, సీకేఎం యూఎఫ్‌డబ్ల్యూసీలో ఐదు, చింతల్ యూపీహెచ్‌సీలో ఒకటి, కాశిబుగ్గ యూపీహెచ్‌సీలో ఒకటి, పైడిపల్లి యూపీహెచ్‌సీలో ఒకటి, గీసుకొండ పీహెచ్‌సీలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆగస్టులో నమోదైన 18 డెంగీ కేసుల్లో తొమ్మిది కేసులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. కీర్తినగర్ యూపీహెచ్‌సీలో నాలుగు, రంగశాయిపేట యూపీహెచ్‌సీలో ఒకటి, పైడిపల్లి యూపీహెచ్‌సీలో ఒకటి, సీకేఎం యూఎఫ్‌డబ్ల్యూసీలో ఒకటి, ఎంజీఎంలో ఒకటి, గీసుకొండ పీహెచ్‌సీలో ఒకటి నమోదైంది.
డెంగీ సాధారణ జ్వరంగా మొదలవుతుంది. 100 నుంచి 104 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు జ్వరం ఉంటుంది. చలి, వణుకు, తీవ్రమైన తలనొప్పి, కంటి వెనుకభాగంలో నొప్పి, ఒళ్లు నొప్పులు, నడుంనొప్పి, శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. రెండు మూడురోజులకు మించి ఈ లక్షణాలు ఉంటే డెంగీ జ్వరంగా భావించాలి. డెంగీ పాజిటివ్ అని తేలితే హైరానా పడొద్దు. డెంగీ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్స్ పడిపోవడం సర్వసాధారణం. కౌంట్ సంఖ్య చూసి ఆందోళన చెందొద్దు. వైద్యుడు సూచించిన మేరకు మందులు వాడాలి.
– డాక్టర్ సాంబశివరావు,
వరంగల్ జిల్లా వైద్యారోగ్య అధికారి
వరంగల్ జిల్లాలో
హాఫ్ సెంచరీ దాటేసిన కేసులు
వీటిలో సగం కేసులు ‘గ్రేటర్’లోనే
వర్షాలతో అమాంతం
పెరుగుతున్న కేసులు
జాగ్రత్తగా ఉండాలంటున్న
వైద్యాధికారులు