
మేడిగడ్డకు వరద తాకిడి..
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. శనివారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదుల గుండా వరద పెరుగుతుండడంతో కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్లను తాకూతూ వరద దిగువకు తరలుతోంది. దీంతో కాళేశ్వరం వద్ద 8.300 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ(లక్ష్మి)బ్యారేజీకి 3.73లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని అదేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. ఆదివారం ఉదయం వరకు వరద మరింత పెరిగే అవకాఽశం ఉందని ఇరిగేషన్ ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి రావొద్దు..
ఎగువ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదనీరు చేరుతుందని, ప్రజలు మహదేవపూర్ మండలం అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వైపు రావొద్దని, చేపల వేటకు వెళ్లద్దని ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్లు, పోలీసులు శనివారం హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోకి రావొద్దని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.
పెరుగుతున్న గోదావరి ప్రవాహం
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి మండలంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తు పాకులగూడెం గ్రామం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. రెండు రోజుల క్రితం బ్యారేజీలోకి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. శనివారం ఎగువన ఉన్న సరస్వతి, లక్ష్మి బ్యారేజీతోపాటు గో దావరిలోకి భారీగా నీరు చేరడంతో సమక్క సాగర్ బ్యారేజీలోకి 4,60,340 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 79.40 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది
ఎగువ నుంచి 3.73లక్షల
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కాళేశ్వరం వద్ద 8.300 మీటర్ల
ఎత్తులో నీటిమట్టం

మేడిగడ్డకు వరద తాకిడి..