సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ :
రైతులు పండించిన ధాన్యాన్ని వానాకాలం, యాసంగి సీజన్లలో ఏటా సేకరిస్తున్న ప్రభుత్వం.. మర ఆడించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైస్‌మిల్లులకు అప్పగిస్తోంది. కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మరాడించి బియ్యాన్ని గడువులోగా పౌరసరఫరాల కార్పొరేషన్, ఎఫ్‌సీఐలకు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లాలో గతేడాది రెండు సీజన్లలో సీఎంఆర్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగలేదు. అయినప్పటికీ అధికారులు ఈ వానాకాలానికి సంబంధించి కూడా సుమారు 281 రా రైస్, పారాబాయిల్డ్ రైసుమిల్లులకు సీఎంఆర్ ధాన్యం సరఫరా చేశారు. రెండు నెలలు కావొస్తున్నా కేవలం 2.19 శాతం మాత్రమే రైస్‌మిల్లర్లు బియ్యం ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించారు.
సర్కారు ధాన్యంతో మిల్లర్ల వ్యాపారం..
సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చే క్రమంలో రైస్‌మిల్లుల యజమానులకు గడువు విధించి నిర్దేశించిన సమయంలోగా అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అయితే ఏటా మిల్లుల యజమానులు గడువును లెక్కచేయకుండా ధాన్యాన్ని బియ్యంగా మార్చి సొంత వ్యాపారం చేసుకుంటూ.. వారికి నచ్చినప్పుడు పౌరసరఫరాల సంస్థ, ఎఫ్‌సీఐలకు బియ్యం అప్పగిస్తున్నారు. ఇది ప్రతి ఏటా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో రైస్‌మిల్లులకు ఈ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన 7,42,261 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ కింద ఇచ్చారు. ఇందుకు 5,04,737 మెట్రిక్ టన్నుల బియ్యం ఆగస్టు వరకు పూర్తిగా ఇవ్వాల్సి ఉండగా.. రెండు నెలల్లో కేవలం 11,068(2.19 శాతం) మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇచ్చారు. గతేడాది వా నాకాలం, యాసంగి సీఎంఆర్‌కు సంబంధించి సుమారు రూ.561 కోట్ల విలువైన బియ్యం పెండింగ్‌లో ఉండగా..ఈవానాకాలం సీజన్‌కు సంబంధించి 4,93,669 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్ల ర్లు ఎప్పటి వరకు ఇస్తారన్న చర్చ జరుగుతోంది.
సీఎంఆర్ జాబితాలో డిఫాల్టర్లు..
గత వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ కింద ధాన్యం తీసుకుని ఇంకా బియ్యం ఇవ్వని డిఫాల్టర్లకు ఈ వానాకాలంలో సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగినట్లు ఫిర్యాదులున్నాయి.
● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో రెండు రైస్‌మిల్లులను నడుపుతున్న హసన్‌పర్తికి చెందిన ఓ వ్యాపారి రూ.కోట్లలో సీఎంఆర్ ఎగవేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అతడిపై రెవెన్యూ రికవరీ యాక్టు పెట్టే అవకాశం ఉన్నా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ధాన్యం కేటాయించడం వివాదాస్పదం అవుతోంది.
● హసన్‌పర్తి మండలం సీతంపేట సమీపంలోని ఓ రైస్‌మిల్లును లీజుకు తీసుకుని సివిల్‌సప్లయీస్ ద్వారా తీసుకున్న సుమారు రూ.15 కోట్ల విలువైన ధాన్యానికి మంగళం పాడినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే గత వానాకాలం, యాసంగి సీఎంఆర్ ఇవ్వని డిఫాల్టర్లకు ఈ సీజన్‌లో ధాన్యం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ సీజన్‌లోనూ రైస్‌మిల్లులకు బ్యాంకు గ్యారంటీ, ష్యూరిటీలు తీసుకుని సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించామని, సీఎంఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి వరంగల్‌కు చెందిన పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు తెలిపారు.
వానాకాలం బియ్యం మరాడింపు మరీ స్లో..
ఉమ్మడి వరంగల్‌లో మిల్లర్లకు
7.42 లక్షల మె.టన్నుల ధాన్యం
సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం 5.04 లక్షల మె.టన్నులు...
రెండు నెలల్లో ఇచ్చింది 11,068 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే
యాసంగి సీఎంఆర్‌పైన నిర్లక్ష్యమే.. డిఫాల్టర్లకు సీఎంఆర్ ధాన్యం?
సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా?


