హోటళ్లలో కుళ్లిన మటన్, చికెన్
హన్మకొండ: హనుమకొండలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీ చేశారు. నక్కలగుట్టలోని ల్యాండ్‌మార్క్ హోటల్, నయీంనగర్‌లోని ఫుడ్ ఆన్ ఫైర్ రెస్టారెంట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌రెడ్డి, స్వాతి, శ్రీషికతో కూడిన బృందం తనిఖీలు చేపట్టింది. ఈరెండు హోటళ్లలో వంట గది పూర్తిగా అపరిశుభ్రంగా, మురికితో, దుర్వాసన కలిగిన రిఫ్రిజిరేటర్‌లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం.. సరైన ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేయనట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపు రూ.45 వేల విలువైన 32 కిలోల నిలువ చేసిన కుళ్లిన మాంసపు ఉత్పత్తులను, హానికర ప్రమాదకర రంగులు కలిపిన చికెన్, కాలం చెల్లిన ఐస్‌క్రీమ్‌లు, పాల ప్యాకెట్లు, మసాలా పొడులు, ఫంగస్‌తో కూడుకున్న కాలీప్లవర్, క్యా బేజీ, ఇతర కూరగాయలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని, శాంపిళ్లు సేకరించారు. బిర్యానీ, ఇతర ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీలో మోతాదును మించి హానికర రసాయనాలతో కూడిన రంగుల వాడకంపై, కుళ్లిన మాంసం, ఫంగస్ తో కూడుకున్న ఆహారపదార్థాలు వాడకంపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ టీం హెడ్ వి.జ్యోతిర్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఎఫ్.ఎస్.ఎస్ 2006 చట్టాన్ని ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేశారు. శాంపిళ్లను సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఆహార కల్తీకి, నిబంధనలు పాటించని హోటళ్ల నిర్వాహకులపై కేసు పెడుతున్నట్లు జ్యోతిర్మయి తెలిపారు.
అపరిశుభ్రంగా వంట గదులు
హనుమకొండలో
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
నోటీసులు జారీ.. కేసు నమోదు
హోటళ్లలో కుళ్లిన మటన్, చికెన్


