
కిక్కిరిసిన ఎల్‌ఆర్‌ఎస్ హెల్ప్‌డెస్క్‌లు
వరంగల్ అర్బన్ : అక్రమ లే ఔట్ స్థలాల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) ఫీజులు చెల్లించేందుకు నగరవాసులు పెద్దఎత్తున బల్దియా హెల్ప్‌డెస్క్‌ల వద్ద బారులుదీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31లోగా ఫీజులు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ లభిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో కదలిక పెరిగింది. దీంతోపాటు నిన్న మొన్నటి వరకు ఎడిట్ ఆప్షన్ లేక అటు అధికార యంత్రాంగం, ఇటు దరఖాస్తుదారులు నానాపాట్లు పడ్డారు. ఎట్టకేలకు ప్రభుత్వం మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో ఎల్‌ఆర్‌ఎస్ రుసుముల చెల్లింపులు వేగిరమయ్యాయి. గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 2020లో 1.10లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో నిబంధనల ప్రకారం ఉన్న సుమారు 60వేలమందికి చెల్లించాల్సిన ఫీజులు తదితర వివరాలను మొబైల్ ద్వారా సమాచారం అందించారు. కొంతమందికి ప్రొహిబిటేడ్, తదితర కారణాలతో పన్ను జనరేట్ కాలేదు. దీంతో వీరంతా బల్దియా కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నారు. అందులో 2020 మార్కెట్ ఫీజు కాకుండా గత ఏడాది కాలంగా చేపట్టిన క్షేత్ర స్థాయిలో ఇష్టారాజ్యంగా పన్ను విధించారు. దీంతో వీరంతా హెల్ప్‌డెస్క్‌కు వస్తుండడంతో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, అధికారులు ఆ లోపాలను సరిదిద్దుతున్నారు.