
ఎంటీపీ యాక్ట్ నిబంధనలు కఠినంగా పాటించాలి
● హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఎంజీఎం: జిల్లాలో పీసీఅండ్ పీఎన్‌డీటీ, ఎంటీపీ యాక్ట్ నిబంధనలను ఆస్పత్రులు, క్లినిక్‌లు, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలు కఠినంగా పాటించాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. ఈ మేరకు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం నగరంలోని నాలుగు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. రికార్డులు, సర్టిఫికెట్‌లు, స్నానింగ్ మెషీన్‌లు, ఫామ్ – ఎఫ్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రికార్డులను పరిశీలించారు. ఎంటీపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే నిబంధనలకు లోబడి ఇద్దరు డాక్టర్ల సమక్షంలో అబార్షన్స్ చేయాలని, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత లేని డాక్టర్లు అబార్షన్స్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతినెలా చేసిన అబార్షన్స్ వివరాలు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో జీఎంహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, డాక్టర్ జమున, మహిళా శిశు సంక్షేమశాఖ సఖి వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ హైమావతి, వరంగల్ కమిషనరేట్ భరోసా సెంటర్ ఎస్సై బోయిన మంగ, హెచ్‌ఈఓ రాజేశ్వర్ రెడ్డి, సందీప్, పాల్గొన్నారు.