హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం సంకటహర చతుర్ధి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో పండితులు గంగు మణికంఠ శర్మ, అర్చకులు పెండ్యాల సందీప్ శర్మ, పానుగంటి ప్రణవ్‌లు ఉదయం నుంచే ప్రభాత పూజ, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. సాయంత్రం 7గంటలకు సంకటచతుర్ధిని పురస్కరించుకుని దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్టగణపతికి పంచసూక్తులతో జలాభిషేకం క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలతో, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తర శతనామాలు పఠిస్తూ షోడశోపచారపూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ : విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ లోడ్ పెరిగే అవకాశం ఉన్న అన్ని చోట్ల అన్ని సర్కిళ్ల పరిధిలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏ ర్పాటు చేశామన్నారు. ఇంటర్ లింకింగ్ పనులు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పా టు, వీసీబీల ఏర్పాటు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్‌ఈలను ఆదేశించారు. ఏప్రిల్‌లో పంట కోతలు పూర్తి కాగానే వ్యవసాయ సర్వీసుల త్వరితగతిన రిలీజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, సీఈలు తిరుమల్‌రావు, రాజు చౌహాన్, అశోక్, బీకం సింగ్, వెంకటరమణ, డీఈ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
20న జాబ్ మేళా
హన్మకొండ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఈనెల 20న(గురువారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వర్చువల్ సెల్స్ ఎగ్జిక్యూటివ్, యాక్సిస్ బ్యాంక్‌లో బిజినెస్ డెవెలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ 20 పోస్టుల భర్తీకి ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ బాయ్స్ క్యాంపస్‌లోని జిల్లా ఉపాఽధి కార్యాలయంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు 18–35 ఏళ్ల లోపు ఉండాలని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, ఆసక్తి ఉన్న యువతీ యువకులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98488 95937 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
ఉద్యోగిని పట్ల డాక్టర్ అనుచిత ప్రవర్తన
ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన
హన్మకొండ చౌరస్తా: ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని పట్ల ఆస్పత్రి యజమాని అయిన డాక్టర్ అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. బాధితురాలు, ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ పోచమ్మైదాన్‌కు చెందిన మహిళ ఏడాది కాలంగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నది. సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చిన డాక్టర్ రిసెప్షన్ వద్ద చిందరవందరగా ఉన్న ఫైళ్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆస్పత్రి సిబ్బంది ఎదుట అవమానించడంపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ భర్తకు ఫోన్ చేసి తెలియజేసింది. దీంతో అతను 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అయితే.. సదరు ఉద్యోగిని డాక్టర్ క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.
సంకటహర చతుర్ధి పూజలు