
చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం
వరంగల్: వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎన్నికల ప్రక్రియ అయోమయంలో పడింది. ఇటీవల నిర్వహించిన చాంబర్ ఈసీ, జనరల్ బాడీ సమావేశాల్లో కొత్తగా మూడు నిబంధనలు ప్రవేశపెట్టి బైలాలో చేర్చారు. అందులో 1.ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న ఏవ్యక్తి అయినా చాంబర్ ఎన్నికల్లో పోటీ చేస్తే అనర్హుడిగా పరిగణిస్తారు. 2.చాంబర్ పాలకవర్గానికి మూడేళ్ల కాలపరిమితి, 3.ఒక వ్యక్తి మూడు పర్యాయాల కంటే ఎక్కువ అధ్యక్షుడిగా ఉండకూడదు. ఈనిబంధనలను నిలిపివేయాలని చాంబర్‌కు చెందిన దేశబత్తుల రమేశ్‌బాబు, కంచె సంపత్ జిల్లా కోర్టును శుక్రవారం ఆశ్రయించారు. దీంతో ఈనెల 24వ తేదీ వరకు స్టేటస్‌కోను వర్తింపజేస్తూ జిల్లా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల ప్రక్రియ నిలిపి వేసేందుకు కోర్టును ఆశ్రయించడంపై ప్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీకే నామినేషన్ తిరస్కరణ
9వ తేదీన 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి(డీకే)అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. కార్పొరేటర్‌గా కొనసాగుతున్నందున కొత్తగా వచ్చిన నిబంధన ప్రకారం డీకే నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. 9న నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అధ్యక్ష స్థానానికి దాఖలు చేసిన డీకే, సంయుక్త కార్యదర్శి స్థానానికి పోటీ చేసిన నల్లా సాంబయ్య నామినేషన్లు తిరస్కరణకు గురవగా మిగిలిన నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారి జాబితాలో పేర్కొన్నారు.
అమలులో నిబంధనలు..
వరంగల్ చాంబర్ ఎన్నికలపై జిల్లా న్యాయస్థానం స్టేటస్‌కో జారీ చేయడంతో 24వ తేదీ వరకు ఈ ప్రక్రియకు బ్రేక్ పడనుంది. 9వ తేదీన నామినేషన్లు పూర్తి కాగా.. 10వ తేదీన జరిగిన స్క్రూటినీలో డీకే నామినేషన్ తిరస్కరించడం, ఎన్నికల ప్రక్రియపై కోర్టు స్టేటస్ కో జారీ చేయడంతో ప్రక్రియ కొన్ని రోజుల పాటు వాయిదా పడనుంది. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను యథాతఽథంగా 24.11.2023 వరకు నిలిపేస్తూ స్టేటస్‌కో కోర్టు జారీ చేయడంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. చాంబర్ బైలాలో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు జనరల్ బాడీ మీటింగ్‌లో ఆమోదం పొందినందున వాటిని అమలు చేస్తారని తెలిసింది.
కుమారస్వామి నామినేషన్ తిరస్కరణ
స్టేటస్‌కో జారీ చేసిన జిల్లా న్యాయస్థానం
ఈనెల 24వరకు ప్రక్రియ నిలిపివేత