ముగిసిన సాహితీ–సాంస్కృతిక సదస్సులు
హన్మకొండ అర్బన్: సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం శ్రీహర్ష కన్వెన్షన్‌లో గుంజి వెంకటరత్నం కృషి సమాలోచన సదస్సు నిర్వహించారు. పూర్వ తెలుగు అకాడమీ సంచాలకులు యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో పలు అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సాయంత్రం కాళోజీ కళాక్షేత్రంలో ప్రతిభా మూర్తి పురస్కార ప్రధాన సభ నిర్వహించారు. ఈ సభకు నేరెళ్ల శోభావతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సద్గురు శ్రీ శివానంద నృత్యమాల నాట్యాచార్యులు బి.సుధీర్‌రావు శిష్య బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో బన్న ఐలయ్య, గండ్ర లక్ష్మణరావు, మడత భాస్కర్, వల్సపైడి, పాలకుర్తి దినాకర్, దహనం సాంబమూర్తి, ఎమ్మెస్కో హైదరాబాద్ ప్రధాన సంపాదకులు దుర్గంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసార భారతి ఉపసంచాలకులు రేవూరి అనంత పద్మనాభరావు, తెలంగాణ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఎస్పీ రంగరాజు భాస్కర్, సహృదయ పూర్వ అధ్యక్షుడు కేఎల్‌వీ ప్రసాద్, గన్నమరాజు గిరిజమనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


