సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
ఎంపీ కావ్య,
ఎమ్మెల్యేలు నాయిని, కడియం
హన్మకొండ: కాలేజీ రిటైర్డ్ అధ్యాపకుల సమస్యలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పెన్షనర్స్ డే, అసోషియేషన్ 2026 డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఎంతో అవసరమని ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. కళాశాల రిటైర్డ్ అధ్యాపకుల సంఘ భవన అభివృద్ధికి చెరో రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా రిటైర్డ్ అధ్యాపకులను సన్మానించారు. రిటైర్డ్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ డైరీని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్‌సీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు డి.సత్యనారాయణరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి, కార్యదర్శి బి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంధుల జీవితాల్లో బ్రెయిలీ వెలుగు
అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆదివారం హనుమకొండ జెడ్పీ హాల్‌లో తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కావ్య.. వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి కేక్ కట్ చేశారు. సంఘం నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కంటి ఆస్పత్రి డాక్టర్ భరత్‌కుమార్, అంధుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగయ్య, సభ్యులు పాల్గొన్నారు.
ఇన్‌సర్వీస్ టీచర్ల టెట్ రద్దుకు కృషి
విద్యారణ్యపురి: ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ రద్దుకు తనవంతుగా కృషి చేస్తానని ఎంపీ కావ్య అన్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ రూపొందించిన నూతన సంవత్సరం డైరీని, క్యాలెండర్‌ను కావ్య ఆవిష్కరించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ భీమళ్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, టీపీటీఎఫ్ డైరీ, క్యాలెండర్‌ను హనుమకొండలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కూడా ఆవిష్కరించారు.


