గుంటూరు నగర పాలక సంస్థ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం సోమవారం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో కార్పొరేటర్లతో అధికారులు మూకుమ్మడిగా ప్రమాణం చేయించారు. కార్పొరేషన్ నుంచి వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికైన 11 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
పెదకాకాని: భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసేందుకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత, రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డిలు విచ్చేశారు. పెదకాకాని శివాలయానికి సోమవారం విచ్చేసిన అతిథులకు డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాసులురెడ్డి, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత, డైరెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి దంపతులు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామి వారి తీర్ధ ప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో పాలకవర్గం ఎక్స్‌అఫిషియో సభ్యుడు, ఉప ప్రధాన అర్చకులు పేటేటి ధనమహేశ్వరప్రసాద్, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు.


