రోబోటిక్‌ సర్జరీతో కీళ్ల మార్పిడిలో సరికొత్త విప్లవం | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్‌ సర్జరీతో కీళ్ల మార్పిడిలో సరికొత్త విప్లవం

Nov 24 2026 1:54 AM | Updated on Nov 24 2026 1:54 AM

మోకీలు మార్పిడిలో అత్యాధునిక సాంకేతికత..

రోగి అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత చికిత్స

వందకు పైగా రోబోటిక్‌ మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం

డాక్టర్‌ గిరిధర్‌ బోయపాటి

గుంటూరు మెడికల్‌: వైద్యరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త విప్లవానికి నాంది పలికిందని ప్రముఖ ఆర్థోపెడిక్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ గిరిధర్‌ బోయపాటి తెలిపారు. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సల్లో రోబోటిక్‌ సాంకేతికత అందుబాటులోకి రావడంతో మరింత కచ్చితత్వంతో చికిత్స అందించే అవకాశం ఏర్పడిందని చెప్పారు. గుంటూరులోని కనుమూరి హాస్పిటల్స్‌లో సోమవారం మీడియా సమావేశంలో డాక్టర్‌ గిరిధర్‌ మాట్లాడారు. ఇప్పటికే వందకు పైగా రోబోటిక్‌ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. అమెరికా, బ్రిటన్‌న్‌లలో అధునాతన ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్సలపై ప్రత్యేక శిక్షణ పొందిన ఆయన, ప్రపంచస్థాయి వైద్య సాంకేతికతను గుంటూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

పెరుగుతున్న కీళ్ల సమస్యలు..

ప్రస్తుత జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక బరువు, వయస్సు పెరగడం వంటి కారణాలతో మోకీలు సమస్యలు ఎక్కువవుతున్నాయని వివరించారు. మోకీళ్లలోని అరిగిపోయే గుజ్జు దెబ్బతినడం వలన నొప్పి, వాపు, నడవలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వీటిని వయస్సుతో వచ్చే సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

రోబో సర్జన్‌న్‌కు సహాయక సాధనం మాత్రమే

రోబోటిక్‌ సర్జరీలో రోబో స్వతంత్రంగా ఆపరేషన్‌ చేయదని, వైద్యుడే శస్త్రచికిత్స నిర్వహిస్తారని వివరించారు. రోబో సర్జన్‌కు సహాయక సాధనంగా పనిచేస్తూ ఎక్కడ కోత పెట్టాలి, ఎంత మేరకు ఎముక తొలగించాలి, కృత్రిమ మోకాలిని ఏ స్థానంలో అమర్చాలి అనే అంశాల్లో కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో వెళ్లి రోబోటిక్‌ మోకీలు మార్పిడి వ్యవస్థలో నూతనంగా అభివృద్ధి చేసిన ఆటోప్లాన్‌ సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ పొందినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్సల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. అత్యాధునిక వైద్య చికిత్సల కోసం ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదని డాక్టర్‌ గిరిధర్‌ బోయపాటి అభిప్రాయపడ్డారు. గుంటూరులోనే ఆధునిక సాంకేతికత, నైపుణ్యం కలిగిన వైద్యులు, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటే స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement