కమ్యూనిటీ మెడిసిన్‌లో యూనివర్సిటీ టాపర్‌గా స్నేహ | - | Sakshi
Sakshi News home page

కమ్యూనిటీ మెడిసిన్‌లో యూనివర్సిటీ టాపర్‌గా స్నేహ

Nov 24 2026 1:54 AM | Updated on Nov 24 2026 1:54 AM

800 మార్కులకు 656 మార్కులు సాధించిన

గుంటూరు వైద్యకళాశాల విద్యార్థిని

గుంటూరు మెడికల్‌: డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ సోమవారం విడుదల చేసిన పీజీ వైద్య పరీక్షల ఫలితాల్లో గుంటూరు వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ఆర్‌.స్నేహ కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగంలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. మొత్తం 800 మార్కులకు 656 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌, అదనపు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి డాక్టర్‌ స్నేహను ప్రత్యేకంగా అభినందించారు. పీజీ వైద్య పరీక్షల్లో విశ్వవిద్యాలయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ పూర్ణమ్మ డాక్టర్‌ స్నేహను అభినందిస్తూ, ఆమె కృషి, పట్టుదల ఇతర పీజీ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, ఈ విజయం విభాగానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ స్నేహ మాట్లాడుతూ తనను ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారని, వారి త్యాగం, ప్రోత్సాహమే తన విజయానికి పునాది అని పేర్కొన్నారు. తన విజయాన్ని తల్లిదండ్రులకు, ఉత్తమ వైద్యురాలిగా తీర్చిదిద్దిన గురువులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

రక్షిత జైన్‌కు ద్వితీయ ర్యాంక్‌

థియరీలో రాష్ట్రంలో ప్రథమ ర్యాంక్‌

గుంటూరు మెడికల్‌: కాలేజ్‌లోని శ్వాసకోశ వైద్య విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రిస్పైరాటరీ మెడిసిన్‌) పీజీ విద్యార్థిని డాక్టర్‌ రక్షిత జైన్‌ ప్రతిభను చాటుతూ పీజీ పరీక్షల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆమె 800 మార్కులకు 601 మార్కులు సాధించి యూనివర్సిటీ స్థాయిలో ద్వితీయ ర్యాంక్‌ పొందడంతోపాటు, థియరీలో 400 మార్కులకు 280 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమ ర్యాంక్‌ కై వసం చేసుకున్నారు. వైద్య విద్యలో ఆమె చూపిన అంకితభావం, పట్టుదల, కృషి, నిరంతర శ్రమ, అత్యుత్తమ ప్రతిభకు ఈ ఘన విజయం నిదర్శనంగా నిలిచింది. గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి, శ్వాసకోశ వైద్య విభాగం ప్రొఫెసర్‌, విభాగాధిపతి డాక్టర్‌ ఎస్‌.రఘు, శ్వాసకోశ వైద్య విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు ఆమెను అభినందించారు. ఆమె సాధించిన విజయంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్‌ వైద్య వృత్తిలో కూడా ఇదే స్థాయిలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డాక్టర్‌ రక్షిత జైన్‌ సాధించిన ఈ ఘన విజయం గుంటూరు మెడికల్‌ కాలేజ్‌తో పాటు శ్వాసకోశ వైద్య విభాగానికి కూడా గర్వకారణంగా నిలిచింది.

26న గుంటూరు లక్ష్మీనరసయ్యకు సాహితీ పురస్కారం

నగరంపాలెం: ప్రముఖ సాహిత్య విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్యకు దివంగత సిహెచ్‌.లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పురస్కార నిర్వాహకురాలు ఆచార్య సిహెచ్‌.సుశీలమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న బృందావన్‌గార్డెన్‌ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించనున్న సభకు ఏఎన్‌యూ తెలుగు విభాగాధిపతి ఎన్‌వీ కృష్ణారావు, ప్రముఖ కవి ఖాదర్‌ మొహియుద్దీన్‌, ఏపీ విశ్రాంత డీజీపీ సిహెచ్‌.ద్వారకాతిరుమలరావు హాజరవుతారని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement