గుంటూరు రూరల్: పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర వ్యవసాయమే లక్ష్యంగా మొత్తం రూ.63.08 కోట్ల అంచనా వ్యయంతో ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం ఏడు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన అగ్రి ట్రాన్స్‌ఫర్ మిషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్, స్కిల్స్, అండ్ సస్టైనబులిటీ ప్రాజెక్టులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో నిధులు సమకూర్చే అంశంపై విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ అధ్యక్షతన ఐసీఐసీఐ ఫౌండేషన్ ప్రతినిధులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగర శివారుల్లోని లాం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హెడ్ పి.సైమన్‌రాజ్, ప్రోగ్రామ్ లీడర్ శిరీషలు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం సమర్పించిన ప్రాజెక్టులు, వాటి అమలు విధానం, అవసరమైన నిధులపై చర్చించారు. ఐసీఐసీఐ ఫౌండేషన్‌న్‌తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని, సీఎస్‌ఆర్ నిధులతో వ్యవసాయ పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధితోపాటు రైతుల ఆర్థిక ప్రగతికి కృషి చేయాలని నిర్ణయించారు. సమావేశంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.మణి, వివిధ విభాగాధిపతులు, ప్రతిపాదిత ప్రాజెక్ట్ లకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
పోలింగ్ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు
నెహ్రూనగర్: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల సాధారణ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు పోలింగ్ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు గుంటూరు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ ఆషారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 (గురువారం), 29 (ఆదివారం), డిసెంబర్ 2 (బుధవారం) పోలింగ్ తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. గుంటూరు జోన్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల యాజమాన్యాలు ఈ నిబంధనను పాటించాలని సూచించారు.
పోక్సో కేసు నమోదు
కొల్లిపర: బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై సోమవారం పోక్సో కేసు నమోదు నమోదైనట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. కొల్లిపర గ్రామానికి చెందిన దొప్పలపూడి వంశీ అదే గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలికను పొలంలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
యువకుడు ఆత్మహత్య
మంగళగిరి రూరల్: మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో యలమద్ది నాగరాజు (45) సోమవారం తన ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నరసరావుపేట సబ్‌జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చినట్లు సమాచారం. గతంలో పల్నాడు జిల్లా యడ్లపాడు, చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులు నమోదయ్యాయని సమాచారం. పది రోజుల కిందట సబ్ జైలు నుంచి ఇంటికి వచ్చిన నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణం చెందాడని స్థానికులు అంటున్నారు. ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


