అమరారామంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

అమరారామంలో భక్తుల సందడి

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

అమరారామంలో భక్తుల సందడి సర్పంచ్‌ బరిలో తోడికోడళ్లు వైభవంగా పల్లకీ సేవ భక్తజన సందోహం

అమరావతి: ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి ఆలయంలో కార్త్తిక మాసంలో రెండో ఆదివారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసే వీలులేక దేవస్థానం వారు ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానం చేశారు. ఆలయంలో కార్తిక దీపాలు వెలిగించి కార్తిక దామోదరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. స్థానిక ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద, మ్యూజియంలో కూడా భక్తుల సందడి కనిపించింది. కాగా, బాల చాముండికా సమేత అమరేశ్వరుడిని ఆంధ్రప్రదేశ్‌ ఉప లోకాయుక్త రజిని ఆదివారం దర్శించుకున్నారు. తొలుత అర్చకులు, వేద పండితులు ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామికి అభిషేకాలు, బాల చాముండేశ్వరీదేవికి అష్టోత్తర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి, స్వామి వారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.

రొంపిచర్ల: రొంపిచర్లలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. ఈ గ్రామ పంచాయతీ బీసీ మహిళకు రిజర్వేషన్‌ అయ్యింది. దీంతో తోడికోడళ్లు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. బండారు వీరాంజనేయులు (అంజి) భార్య శివలీల టీడీపీ మద్దతుతో బరిలో ఉన్నారు. ఆయన సోదరుడు బండారు నరసింహారావు (బుజ్జి) భార్య తిరుపతమ్మ వైఎస్సార్‌ సీపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. గ్రామ చరిత్రలో ఒకే ఇంటికి చెందిన తోడికోడళ్లు ఇలా సర్పంచ్‌ అభ్యర్థులుగా పోటీ చేయడం ఇదే ప్రథమం. ఇది గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే ఈ నెల 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

నగరంపాలెం: కార్తిక మాసం సందర్భంగా ఆదివారం పట్టాభిపురంలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆవరణలో ఆదియోగి పల్లకీసేవ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర మేయర్‌ కోవెలమూడి లక్ష్మీఅపర్ణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆదియోగి పల్లకీ సేవ, శివాంగ స్ఫూర్తి, కై లాస వాద్యాల సమర్పణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈశా ఫౌండేషన్‌ నిర్వాహకుడు సాంబశివరావు, దేవస్థాన నిర్వాహాకులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పవిత్ర కార్తిక మాసం, ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. వీఐపీలు, ప్రొటోకాల్‌ దర్శనాలను సైతం రద్దు చేసి అందరికీ బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300 టికెట్లపై భక్తులకు రెండు క్యూలైన్ల ద్వారా, రూ.100 ఒక క్యూలైన్‌ ద్వారా, సాధారణ భక్తులకు సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవకుండా స్కానింగ్‌ పాయింట్‌తో పాటు ఆలయం లోపల అధికారులు క్యూ లైన్లను పర్యవేక్షించారు. మరో వైపున భవానీ దీక్షలు ప్రారంభమై 3వ రోజు కావడంతో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దీక్షలను స్వీకరించడం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement