పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి, మాజీ ఎంపీ మోదుగుల, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా 11 మంది జీఎంసీ కార్పొరేటర్లకు ఘన సన్మానం
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అక్రమాలు, దౌర్జన్యాలను ఎదుర్కొని, ప్రజల మద్దతుతో గెలిచిన కార్పొరేటర్లు నిజమైన పోరాట యోధులని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన తాడికొండ అలివేలు నాగ వెంకట పద్మ శ్రీదేవి అన్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందిన 11 మంది కార్పొరేటర్లను ఆదివారం బృందావన్ గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతూ, పోటీలో ఉన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఏకపక్షంగా గెలవాలనే అధికార మదంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారని ఆరోపించారు. స్వయంగా సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో నారా లోకేష్ ఎన్నికల్లో అక్రమాలు, రిగ్గింగ్‌ను ముందుండి నడిపించారని అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులు, నేతల అండదండలతో టీడీపీ మూకలు రెచ్చిపోయాయని మండిపడ్డారు. వారికి పోలీసులు వత్తాసు పలికారని ధ్వజమెత్తారు. నామినేషన్ ప్రక్రియ మొదలుకొని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
బాధ్యతాయుతంగా మెలగాలి
కూటమి నేతల దౌర్జన్యాలు, రిగ్గింగ్, దాడులను తట్టుకుని నిలబడి, ప్రజల అండతో వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. కార్పొరేటర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం ప్రజల పక్షాన నిలిచి, కూటమి అక్రమాలపై పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా కార్పొరేటర్లు కూడా ప్రజలకు అండగా ఉండాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాదాసు ఉషారాణి, దొప్పల వినోదరాణి, ఫారూక్ మొహమ్మద్, షేక్ అమీనా బేగం, షేక్ ఫిరోజ్, షేక్ సమీవుల్లా బేగ్, మొహమ్మద్ నూర్జహాన్, దాసరి నాగరాజు, షేక్ రోషన్, గడ్డం రవికుమార్, మారంరెడ్డి కోటేశ్వరిలను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.


