తాడేపల్లి 44వ డివిజన్‌లో అధికారుల పర్యటనపై కలకలం పట్టాలు ఇస్తున్నారంటూ ప్రచారం ప్రశ్నించడంతో ఓటరు స్లిప్పులంటూ అధికారుల సమాధానం తహసీల్దార్, వీఆర్వోల చేతుల్లో కనిపించని ఓటరు స్లిప్పులు స్థానికుల ఆందోళన.. వీఆర్వో ఇంట్లోకి వెళ్లి దాక్కోవడంపై అనుమానాలు
తాడేపల్లి రూరల్: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న తరుణంలో తాడేపల్లిలో ఆదివారం చోటుచేసుకున్న ఓ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఓటరు స్లిప్పుల పంపిణీ పేరుతో అటవీ భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇస్తున్నారంటూ ప్రచారం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో తహసీల్దార్, వీఆర్వో స్వయంగా పర్యటించడం, స్థానికులు నిలదీయడంతో ఓటరు స్లిప్పుల పంపిణీ కోసమే వచ్చామని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి 44వ డివిజన్ పరిధిలోని అటవీ భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు పంపిణీ చేస్తున్నారంటూ ఆదివారం రాత్రి జోరుగా ప్రచారం జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తహసీల్దార్, వీఆర్వోతో కలిసి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అధికారుల పర్యటనపై అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు.. పట్టాలు పంపిణీ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. వచ్చిన అధికారులు స్థానికులను ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంటి పత్రాలు అడిగినట్లు చెబుతున్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీకి వాటితో పని ఏముందని స్థానికులు ప్రశ్నించారు. అందుకు వీఆర్వో పట్టాలు కాదని, ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నామని సమాధానమిచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే, ఓటరు స్లిప్పులు చూపించాలంటూ వారిని కోరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. వీఆర్వో సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కోవడంతో స్థానిక మహిళలు ఆ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడే ఉన్న తహసీల్దార్ కూడా మెల్లగా వెళ్లిపోయినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా, తాము ఓటరు స్లిప్పుల పంపిణీ కోసమే వచ్చామని తహసీల్దార్ స్వయంగా చెప్పడం ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం.
కోడ్ అమల్లో అధికారుల పర్యటనపై ప్రశ్నలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో, పోలింగ్‌కు కేవలం రెండు రోజులే గడువు ఉన్న తరుణంలో ప్రభుత్వ రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించాల్సిన అవసరం ఏమొచ్చిందని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పేరుతో పట్టాల పంపిణీ జరుగుతోందంటూ ప్రచారం జరగడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని నిలదీస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అధికారులు.. స్థానికులు ప్రశ్నించినప్పుడు స్పష్టమైన వివరణ ఇవ్వకుండా వెళ్లిపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోందని వైఎస్సార్ సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక, ఓటమి భయంతోనే అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి వ్యవహారాలకు తెరతీస్తున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళ అధికారుల పర్యటనలు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలపై ఎన్నికల అధికారులు దృష్టి సారించి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.


