తెర వెనుక ఒప్పందాలు..
నిధుల విడుదలకు కమీషన్లు
క్లాసులకు మంగళం.. కాసులకు గాలం
ఏఎన్‌యూ ‘దూరవిద్య’లో విచిత్ర పరిణామం పాఠాలు వద్దు.. పరీక్షలు ముద్దు పత్తాలేని పీసీపీ క్లాసుల నిర్వహణ.. చెల్లింపుల్లో మాత్రం ఘనం అడ్మిషన్ల నుంచి డిగ్రీ పట్టావరకు అడ్డదారులే ఇవన్నీ గాలికొదిలి పరీక్షలపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న అధికారులు విస్తుపోతున్న విద్యావేత్తలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లే స్థోమత లేనివారు, ఉద్యోగాలు చేస్తూ, కుటుంబ జీవితం గడుపుతూ తీరిక సమయంలో చదువు కొనసాగించాలనుకునేవారు, ఉద్యోగాలు చేస్తూ పదోన్నతులు పొందాలనుకునేవారికి వయస్సుతో సంబంధం లేకుండా ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు అందిస్తోంది. దూరవిద్యలో కోర్సులు చదువుతున్నప్పటికీ వారిని సాధ్యమైనంతమేర నిపుణులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దూరవిద్యలో కూడా వీకెండ్ లేదా పీసీపీ (పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్)ను దూరవిద్యలో అమలు చేస్తున్నారు. ఈ క్లాసులకు హాజరవ్వడం ద్వారా విద్యార్థికి తాను చదివే కోర్సు వివరాలు, పాఠ్యాంశాలు, పరీక్షలు రాయాల్సిన విధానం తదితర అంశాలు ప్రత్యక్షంగా తెలియజేయడంతోపాటు విద్యార్థి సందేహాలను నివృత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఏఎన్‌యూ దూరవిద్యలో ఇది కనుచూపుమేరలో కనిపించకపోవడం విశేషం.
పత్తాలేని పీసీపీ క్లాసుల నిర్వహణ..
ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 240 వరకు అధ్యయన కేంద్రాల ద్వారా ఉన్నత విద్యా కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి తరువాత వీకెండ్ లేదా పీసీపీ తరగతులు నిర్వహించాల్సి ఉంది. గతంలో అయితే ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ వీకెండ్ తరగుతులు నిర్వహించేవారు. ప్రస్తుతం అడ్మిషన్ల సమయంలోనే పీసీపీ తరగతుల నిర్వహించే షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. దూరవిద్యాకేంద్రం నిర్వహించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి స్టడీ సెంటర్ (అధ్యయన కేంద్రం) తమ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థికి తప్పకుండా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు, అధ్యాపకుల ద్వారా పీసీపీ తరగతులు నిర్వహించాలి. అధ్యయన కేంద్రాలు పీసీపీ తరగతుల ఎలా నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల స్పందన ఎలా ఉంది, అడ్మిషన్ పొందిన విద్యార్థులందరూ తరగతులకు హాజరవుతున్నారా లేదా అనే అంశాలను దూరవిద్యాకేంద్రం ఉన్నతాధికారులు తనిఖీల ద్వారా పరిశీలించాలి. తరగతుల నిర్వహణను మరింత మెరుగ్గా చేపట్టేందుకు సూచనలు చేయాలి. కానీ ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రం అధికారులు పీసీపీ నిర్వహణ అంశాన్ని మాత్రం గాలికొదిలేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చాలా చోట్ల అసలు తరగతుల నిర్వహణే లేదనే విమర్శలూ ఉన్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ తరుణంలో పీసీపీ తరగతుల నిర్వహణలో గూగుల్ ఫామ్స్ విధానం అమలు, తరగతుల నిర్వహణ గూగుల్ ఫొటోల అప్‌లోడ్ వంటి సంస్కరణలు ప్రవేశ పెట్టాల్సిన అధికారులు ఉద్దేశపూర్వకంగా గాలికొదిలేశారు.
అడ్మిషన్ల నుంచి పట్టా వరకు అడ్డదారులే!
దూరవిద్యలో విద్యార్థి అడ్మిషన్ నుంచి డిగ్రీ పట్టా పొందే వరకు చాలా అంశాలు అడ్డదారుల్లో నడుస్తున్నాయని వీటిని అరికట్టాల్సిన అధికారులే యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. కానీ అన్నీ అయిపోయిన తరువాత పరీక్షల నిర్వహణలో మాత్రం ఆ అధికారులే హడావుడి చేస్తూ లేనిపోని నిబంధనలు అమలు చేస్తూ, అధికారం చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు తరగతులకే రాని విద్యార్థికి పాఠ్యాంశాలు, పరీక్షలు రాయడం ఎలా తెలుస్తుందో అధికారులే చెప్పాలని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ఏఎన్‌యూ దూర విద్యా కేంద్రం
పీసీపీ తరగతులు నిర్వహించినందుకుగాను యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం సంబంధిత అధ్యయన కేంద్రాలకు ప్రత్యేకంగా రెమ్యూనరేషనన్ ఇస్తుంది. విద్యార్థి చెల్లించే ఫీజు నుంచి కొంతశాతం పీసీపీ రెమ్యూనరేషన్‌గా స్టడీ సెంటర్లకు చెల్లిస్తుంది. దీనికోసం స్టడీ సెంటర్లు తరగతులకు హాజరైన విద్యార్థుల వివరాలు, హాజరు, విద్యార్థుల సంతకాలు, బోధకుల వివరాలు, వారి సంతకాలు తదితర పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా నివేదిక రూపంలో ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రానికి సమర్పించాలి. దూరవిద్యా కేంద్రం అన్ని అంశాలను పరిశీలించి అధ్యయన కేంద్రాలకు పీసీపీ రెమ్యూనరేషన్ నిధులు విడుదల చేస్తుంది. కానీ పీసీపీ తరగతుల పర్యవేక్షణను గాలికొదిలిన అధికారులే పీసీపీ రెమ్యునరేషన్ నిధుల విడుదలలో అత్యుత్సాహం కనబరుస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. చాలా అధ్యయన కేంద్రాలతో తెరవెనుక ఒప్పందాలు ఉన్నాయని దూరవిద్య కేంద్రం ఉన్నతాధికారి నుంచి స్థాయిని బట్టి ఈ నిధుల విడుదలకు కమీషన్లు ఉన్నాయనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. అధ్యయన కేంద్రాలకు యూనివర్సిటీ ఏటా రూ.కోట్లు అధికారికంగా చెల్లిస్తుండగా అనధికారికంగా రూ.లక్షలు కొందరు అధికారులకు చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఏఎన్‌యూ దూరవిద్య పలువురికి కాసుల పంట పండిస్తోంది. ఇతర వర్సిటీలు తమ అధ్యయన కేంద్రాల్లోని విద్యార్థులకు అర్ధవంతమైన బోధన అందేందుకు ఎప్పటినుంచో ఆధునిక విధానాలను అమలు చేస్తుండగా.. వాటిని ఏఎన్‌యూ ఉన్నతాధికారులు ఇప్పటికీ ఒంటపట్టించుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. కనీసం పర్సనల్ కాంటాక్ట్ ప్రోగామ్స్ (పీసీపీ)ని సైతం పట్టించుకోకపోవడం విడ్డూరం. ఇక్కడి ఉన్నతాధికారులకు చేయి తడపందే అధ్యయన కేంద్రాలకు రెమ్యునరేషన్ అందని పరిస్థితి. అడ్మిషన్ల నుంచి డిగ్రీ పట్టా వరకు అన్నింటా అడ్డదారులు తొక్కుతూ ఏఎన్‌యూ అధికారులు అవినీతి రికార్డులు తిరగరాస్తున్నారు.


