జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ‘మార్పు’ కార్యక్రమం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఆయా పనులు చేపట్టాలన్నారు. సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, వర్షం నీటి సంరక్షణ కోసం రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థల నిర్మాణం, మొక్కల పెంపకం, పరిసరాల సుందరీకరణ వంటి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు వి.శంకర్, విజయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డీడీ డి.దుర్గాబాయి, అధికారులు పాల్గొన్నారు.


