గుంటూరు వెస్ట్: జిల్లాలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరలను మరోసారి వివరించి, నిర్ణీత ధరలకు మించి విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బియ్యం రకాల వారీగా కిలో ధరలు వరుసగా బీపీటీ (సోనా, సాంబా), కేఎన్‌ఎం రకాలు – రూ.66, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్ రకాలు – రూ.76, స్వర్ణ మసూరి – రూ.47, జై శ్రీరామ్ – రూ.82 లకు అందిస్తున్నామన్నారు. ప్రతి బియ్యం దుకాణం, మిల్లుల వద్ద వివిధ రకాల ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. బియ్యం విక్రయాల్లో అక్రమాలు, అధిక ధరల వసూళ్లు, తూనికలు, కొలతల్లో మోసాలు జరగకుండా తూనికలు, కొలతల శాఖ, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, జీఎస్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సంయుక్త తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే ఆరు ధరణి బియ్యం అమ్మకం కేంద్రాలు రైతు బజార్లలో పనిచేస్తున్నాయని, వాటి ద్వారా ఇప్పటివరకు సుమారు 4,500 మంది వినియోగదారులకు 1,150 క్వింటాళ్ల కేఎన్‌ఎం/బీపీటీ రకాల బియ్యం విక్రయించినట్లు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎస్‌ఓ కోమలి పద్మశ్రీ, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎన్.నాగేశ్వరరావు, ఇతర అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ


