నవ్యత చూపుతూ సీతా సుధాకర్ ప్రత్యేకత ప్రముఖ వేదికలపై కళా ప్రదర్శనలు
ప్రతిష్ఠాత్మక ప్రదర్శనల్లో...
తెనాలి: మనసులోని మనోహర భావాలకు తన కుంచెతో రమణీయమైన రూపాలను అద్దుతూ జాతీయస్థాయిలో గుర్తింపును సాధించారు సీతా సుధాకర్. భారత ఇతిహాసాల్లోని సింబాలిక్ భావాలను ప్రస్ఫుటం చేయడంలో కళాత్మక విలువ, రేఖాచిత్ర రచనా సామర్థ్యం ఆమె చిత్రాల్లో గోచరిస్తాయి. ప్రకృతి, భగవంతుడి రూపాలే ఆమె చిత్రాల ఇతివృత్తాలు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆ చిత్రాల్లో అధికంగా గణేశుని రూపాలే ఉండటం మరో విశేషం. తనలోని ఆధ్యాత్మిక అంతరంగానికీ, చిత్రకళలో నైపుణ్యానికీ అవి ప్రతిబింబాలని అంటారామె. కవితలను వెలువరిస్తూ, కవయిత్రిగానూ పేరుతెచ్చుకున్నారు. హ్యాండ్‌మేడ్ పెయింటింగ్‌తో మగువల చీరెలకు సొగసులు అద్దుతున్నారు. బెంగళూరులోని జేమహల్ ప్యాలెస్‌లో గత నెల 28 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు ‘స్పిరిచ్యువల్ ఐ’ పేరుతో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ హ్యాండ్‌మేడ్ గ్రూప్ ఎగ్జిబిషన్‌లోనూ తన చిత్రాలు, డిజైనర్ చీరెలతో పాల్గొన్నారు. సీతా సుధాకర్ స్వస్థలం అమృతలూరు మండలంలోని ప్యాపర్రు గ్రామం. ఆమెది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మీఅన్నపూర్ణమ్మ, మొవ్వా రామారావు. తెనాలికి చెందిన పండా సుధాకర్‌తో వివాహమైంది. భర్త ఉద్యోగరీత్యా కొన్నేళ్లు ఢిల్లీలో, ఆ తర్వాత పూణేలో నివసించారు. ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. హోమ్‌సైన్స్‌లో పీజీ చేసినా, సాధారణ గృహిణిగానే ఉండిపోయారు. లలిత కళలపై అభిరుచితో అనుకోకుండా కుంచె పట్టారు.
కళావిమర్శకుల ప్రశంసలు...
ప్రఖ్యాత చిత్రకారుడు తపన్‌చంద్ర భౌమిక్ శిష్యరికంలో సృజనకు మరింత పదునుపెట్టారు. ఆమె కుంచె నుంచి జాలువారిన ‘సప్తస్వరం’, ‘ఉద్భవ్’, ‘నిరీక్షణ’ చిత్రాలు ప్రశంసలను దక్కించుకున్నాయి. రంగుల్లో రమణీయత, భావనలో ఆధ్యాత్మికత, శైలిలో నవ్యత ఆమె ప్రత్యేకతలు. ‘ఎ కలెక్షన్ ఆఫ్ డెపిక్షన్ ఆఫ్ లార్డ్ గణేశ్’ శీర్షికన విఘ్నేశ్వరుడి 32 చిత్రాలు ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి.
చిత్రకళా ప్రదర్శనలతో గుర్తింపు...
ఢిల్లీలోని లలిత కళా అకాడమీలో 1996లో ఈ చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. లండన్‌లో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఢిల్లీలోని ఆలిండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ నిర్వహించిన గ్రూప్ ఎగ్జిబిషన్లలోనూ సీతా సుధాకర్ చిత్రాలకు స్థానం కల్పించారు. లలిత కళా అకాడమీలో తన చిత్రాలతో మరో సోలో ప్రదర్శన నిర్వహించారు. ‘తానా’ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో, ‘చిత్రసంత’లోనూ చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఎల్‌కే అద్వానీ, మాజీ ప్రధాని చంద్రశేఖర్, షీలా దీక్షిత్, వసుంధర రాజే సింథియా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులు ఆమె చిత్రాలను వీక్షించారు. కార్గిల్ యుద్ధ సమయంలో ‘పెయింటింగ్ ఫర్ మిలిటరీ హాస్పిటల్’ పేరుతో జరిగిన చిత్రకళా ప్రదర్శనలోనూ ఆమె చిత్రాలకు అవకాశమిచ్చారు.
కవితా రచనలోనూ...
తనలోని భావాలను కాగితంపై పెడుతూ వచ్చారు సీతా సుధాకర్. తన కవితలతో ‘దిరిసెన పూలు’, ‘పూస్తున్న పూలలో వీస్తున్న పరిమళం’ కవితా సంకలనాలను వెలువరించారు. ‘నానీలు’ రచనలోనూ ప్రావీణ్యం సంపాదించారు. ‘పూనాలో పూచిన నానీలు’ పుస్తకాన్ని తీసుకొచ్చారు.
సీతా సుధాకర్ ఇప్పటివరకు 2,500 చిత్రాలకు రూపమిచ్చారు. దేశవిదేశాల్లో పలు సోలో, 50కి పైగా గ్రూప్ ప్రదర్శనలు ఇచ్చారు. జకార్తా ఆర్ట్ క్యాంప్, గ్రూప్ ఎగ్జిబిషన్‌కు భారతదేశం నుంచి ఎంపికై న ఐదుగురిలో సీతా సుధాకర్ ఒకరు. బెంగళూరులో ఏటా జరిగే ‘ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్’లో పాల్గొంటున్నారు. ముంబయిలోని డీడీ మిరాయ్ ఆర్ట్ గ్యాలరీలో ఏడెనిమిదేళ్లుగా పాల్గొంటున్నారు. అదే నగరంలోని నెహ్రూ ఆర్ట్ సెంటర్‌లో సోలో షో, జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో గ్రూప్ ఎగ్జిబిషన్‌లోనూ పాల్గొన్నారు. చేతికళలను ప్రోత్సహించే ‘హండ్రెడ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్’ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. గతంలోనే ఆలిండియా ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నుంచి ‘బెస్ట్ యంగ్ ఆర్టిస్ట్’గా సత్కారం అందుకున్నారు. చీరెలపైనా హ్యాండ్‌మేడ్ పెయింటింగ్స్ వేస్తున్నారు.


