బాపట్ల(కర్లపాలెం): కర్లపాలెం సెంటర్లో ఉన్న ప్రిన్స్ బ్రదర్స్ జ్యువెలరీలో మంగళవారం భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముసుగు ధరించిన దుండగులు బంగారం దుకాణంలోకి ప్రవేశించి దాదాపు పది కిలోల వెండి, 40 గ్రాముల బంగారాన్ని అపహరించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మంగళవారం ఉదయం షాపు యజమాని జిలానీ షాపు తెరిచేందుకు వచ్చి షట్టర్ తీసి చూడగా షాప్‌లో బంగారం, వెండి చోరీకి గురైనట్లు గమనించి అవాక్కయ్యాడు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేయగా కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర రంగంలోకి దిగి విషయాన్ని డీఎస్పీ చంద్రమౌళి, రూరల్ సీఐ హరికృష్ణకు తెలియజేయడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం సంఘటనా స్థలంలోని వివరాలు సేకరించారు. ఇది స్థానికులు పనా.. లేక బయట నుంచి వచ్చిన వారు చేశారా, అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎంత మొత్తంలో బంగారం, వెండి చోరీకి గురైందనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్లపాలెం ప్రిన్స్ బ్రదర్స్ జ్యువెలరీలో 10 కిలోల వెండి, 40 గ్రాముల బంగారం అపహరణ


