మంగళగిరి రూరల్: మండల పరిధిలోని పుల్లయ్య నగర్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రెండున్నరేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల ప్రకారం.. తాతా వీర ప్రసాద్, లక్ష్మీప్రసన్న దంపతుల కుమార్తె భవిశ్యశ్రీకి సోమవారం సాయంత్రం జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు మంగళగిరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. జ్వరం తీవ్రత పెరగడంతో చిన్నారికి ఫిట్స్ రాగా, అనంతరం పరిస్థితి విషమించి మృతి చెందింది. అకస్మాత్తుగా ఇటువంటి పరిణామం సంభవించిందని చిన్నారి మృతికి విషజ్వరమా లేక సాధారణ జ్వరమా అని అర్థం కాలేదని తల్లిదండ్రులు వాపోయారు. పుల్లయ్య నగర్‌లోని చెరువులోకి ఇళ్ల నుంచి వెలువడే మురుగు నేరుగా కలుస్తుండటంతో చెరువు నీరు కలుషితమవుతోందని ఇటీవల వచ్చిన వర్షాలు వలన చెరువు పరిసర ప్రాంతాలు ఆరోగ్యం పైఎక్కువ ప్రభావం చూపుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా మృతురాలి ఇంటి ముందే చెరువు ఉందని ఈ కారణంగా పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


