శివనామ స్మరణతో మార్మోగిన కాకాని ఆలయం కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులు వైభవంగా ప్రాంగణంలో కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం
పెదకాకాని: ఓం నమః శివాయ నామస్మరణతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం మార్మోగింది. కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులతో ప్రాంగణం కిటకిటలాడింది. పెదకాకాని శివాలయంలో మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్తిక పౌర్ణమి రోజున వేకువజామున భక్తులు యజ్ఞాల బావి వద్ద కార్తికమాస స్నానాలు ఆచరించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు శివాలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. పొంగళ్లు పొంగించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీనివాసులురెడ్డి, పాలకవర్గం చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సకాలంలో దర్శనం జరిగేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు పాలు, మజ్జిగ, తాగునీరు అందించారు. అంతరాలయ దర్శనాలు, అభిషేకాలు, ఏక వారాభిషేక పూజలు, అన్నప్రాశనలు, నామకరణాలు, రాహుకేతు పూజలు అధిక సంఖ్యలో జరిగాయి. ఒక్కరోజులో స్వామి వారికి వివిధ సేవా కార్యక్రమాల ద్వారా రూ.8 లక్షల ఆదాయం లభించినట్లు డీసీ తెలిపారు. సాయంత్రం జరిగిన కోటి దీపోత్సవం, జ్వాలాతోరణ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలువురు భక్తులు శివలింగాకారంలో అలంకరణ చేసి కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తులందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు. పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసుశాఖ సిబ్బంది శివాలయంలో విధులు నిర్వహించారు.


