గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.బాబ్జీ, ప్రధాన కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం అమరావతిరోడ్డులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గుర్తింపు కార్డులు, హెల్త్ ఇన్స్యూరెన్స్, పీఎఫ్, ఈఎస్‌ఐ, కనీస వేతనం, అపాయింట్ లెటర్, ఉపాధ్యాయ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాలు అందించేందుకు సుప్రీంకోర్టు కమిటీని నియమించడం ద్వారా ప్రైవేటు రంగంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల కుటుంబాలకు మేలు జరగనుందన్నారు. కమిటీ త్వరగా నివేదికను పూర్తి చేసి, ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. తద్వారా దశాబ్దాల తరబడి ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి టి.శివయ్య, సభ్యుడు టి.నాగబాబు పాల్గొన్నారు.


