చక్రాయపాలెంలో మంత్రి మనోహర్‌కు చుక్కెదురు | - | Sakshi
Sakshi News home page

చక్రాయపాలెంలో మంత్రి మనోహర్‌కు చుక్కెదురు

Nov 25 2026 2:30 AM | Updated on Nov 25 2026 2:30 AM

చక్రాయపాలెంలో మంత్రి మనోహర్‌కు చుక్కెదురు

వేలంపాటతో చేసిన ఏకగ్రీవం విఫలం సదరు అభ్యర్థి నామినేషను ఉపసంహరణ

తెనాలి: నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం చక్రాయపాలెంలో సర్పంచ్‌ పదవి ఏకగ్రీవం కోసం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేసిన ప్రయత్నం విఫలమైంది. తెనాలి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో, చైర్‌పర్సన్‌గా కాపు సామాజక వర్గానికి చెందిన తోటకూర వెంకటరమణారావుచే కాపుల ఆధిక్యత కలిగిన గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవం చక్రం తిప్పాలని చూశారు. ఈ క్రమంలో రమణారావు ఈ నెల 17న చక్రాయపాలెం చేరుకున్నారు. అక్కడి గంగమ్మ ఆలయం వద్ద షామియానా వేసి గ్రామ సర్పంచ్‌ పదవికి ఆసక్తి కలిగిన అభ్యర్థులతో వేలంపాట జరిపించారు. ముందుగా రూ.10 లక్షలు డిపాజిట్‌ పెట్టించారు. అనంతరం రూ.30 లక్షల నుంచి పాట మొదలైంది. జనసేన పార్టీకి చెందిన అడపాల నాగేశ్వరరావు అందరికంటే అత్యధికంగా రూ.51 లక్షలకు పాడుకున్నారు. రమణారావుతో కలిసి వెళ్లి మంత్రితో భేటీ అయ్యారు. నామినేషన్ల సమయం వచ్చేసరికి అక్కడ పోటీ నామినేషన్లు పడ్డాయి. ఉపసంహరణకు తుది గడువైన మంగళవారం చందు శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావులు ఎన్నికల బరిలో నిలిచారు. ఏకగ్రీవానికి ససేమిరా అనటంతో చేసేదిలేక అడపాల నాగేశ్వరావు తన నామినేషను ఉపసంహరించుకున్నారు. జనసేనకు ఆధిపత్యం కలిగిన గ్రామంలో మంత్రి మనోహర్‌ ఏకగ్రీవం విఫలం కావటం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. కారణాలపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. చక్రాయపాలెంలో వేలం పాట తర్వాత అత్తోటలోనూ ఏకగ్రీవం కోసం రమణారావు బృందం అటుకేసి వెళ్లింది. అక్కడా ఆ ప్రయత్నానికి సహకారం లభించలేదు. ఆ గ్రామంలోనూ జనసేన మద్దతుదారుల మధ్యే రసవత్తర పోటీ నడుస్తోందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement