గుంటూరు వెస్ట్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల రూపురేఖలను మార్చి విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘మార్పు’ పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో ఈ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ చివరి నాటికి హాస్టళ్ల ఆధునికీకరణ పనులకు సంబంధించి ఆర్థికపరమైన అనుమతులు పొందాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఓ లక్ష్మీకుమారి, డ్వామా పీడీ శంకర్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈలు అశోక్, శ్రీనివాసమూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హరిత, అధికారులు పాల్గొన్నారు.


