మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

Nov 25 2026 2:30 AM | Updated on Nov 25 2026 2:30 AM

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి కేలావత్‌ పున్నానాయక్‌

మంగళగిరి రూరల్‌: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడినై వైఎస్సార్‌ సీపీలో చేరానని, మేయర్‌ అభ్యర్థిగా అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని మంగళగిరి–తాడేపల్లి మేయర్‌ అభ్యర్థి కేళావత్‌ పున్నానాయక్‌ (పూర్ణ) అన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి మోహన్‌రావు, మాజీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని ఆత్మకూరులో ఉన్న నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ... తన రాజకీయ ప్రస్థానం, భవిష్యత్‌ కార్యాచరణను వివరించారు. తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసిన వైఎస్సార్‌ సీపీపై తనకు ప్రత్యేక అభిమానం అన్నారు. మేయర్‌గా గెలుపొందితే మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు. తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తానని తెలిపారు. విలీన గ్రామాల్లోనూ తాగునీరు, పారిశుధ్య సమస్యలను పరిష్కరిస్తానన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తానని తెలిపారు. రహదారుల విస్తరణ చేపట్టి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యా వసతులు, సౌకర్యాలను మెరుగు పరుస్తానని తెలిపారు.

పేదలకు ఇళ్ల పట్టాలిస్తాం

పట్టణ పరిధిలో పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తానన్నారు. తాడేపల్లి రైల్వే గేట్‌ వద్ద ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రతిపాదనలు పంపిస్తానన్నారు. తాడేపల్లిలో హిందూ శ్మశాన వాటిక అభివృది, స్థానికంగా మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తానన్నారు. సలాం సెంటర్‌, ఉండవల్లి పల్లె, నులకపేట, క్వారీ, యానాది కాలనీ, అంజిరెడ్డి కాలనీల్లో కొత్త రహదారుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లను మెరుగు పరచడంతో పాటు బస్టాండ్‌, రవాణా సౌకర్యాలు, వీధి దీపాల ఏర్పాటు వంటి సమస్యలపై దృష్టి సారిస్తానని తెలిపారు. పార్కుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణకు చర్యలు తీసుకుంటానన్నారు. గెలిచిన అనంతరం సామాన్య ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పున్నానాయక్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement