ఉపాధ్యాయ ఓటరు నమోదుకు నేటితో ఆఖరు
బీఈడీ అర్హత గల ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకే ఓటు వేసే అవకాశం అర్హతలు లేకున్నా ప్రైవేటు ఉపాధ్యాయులతో పెద్దఎత్తున దరఖాస్తులు దరఖాస్తులు ఆమోదించాలని తహసీల్దార్లపై టీడీపీ నేతల ఒత్తిడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు దరఖాస్తుకు నేడే చివరి రోజు
అర్హతలు లేకున్నా పెద్దఎత్తున దరఖాస్తులు
గుంటూరు ఎడ్యుకేషన్: శాసన మండలి కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరుగా నమోదు చేసుకునేందుకు తుది గడువు శుక్రవారం ముగియనుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కళాశాలలు, యూనివర్శిటీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గత ఆరేళ్ల కాలంలో మూడేళ్ల సర్వీసుకు తగ్గకుండా ఉన్న వారందరూ దరఖాస్తుకు అర్హులే. ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు గత ఆరేళ్ల కాలంలో మూడేళ్లపాటు సర్వీసులో ఉండి, ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొందిన వారూ అర్హులే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సంబంధిత పాఠశాల హెచ్‌ఎం కౌంటర్ సంతకంతో దరఖాస్తు చేయాల్సి ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల దరఖాస్తులపై ప్రిన్సిపాల్ ఆమోదంతో పాటు డీఈఓ కౌంటర్ సంతకం ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇందు కోసం ప్రైవేటు ఉపాధ్యాయులు తమ సర్వీసు సర్టిఫికెట్‌తో పాటు వేతన ధ్రువీకరణ పత్రం, పీఎఫ్ ధ్రువీకరణ, అడ్మిషన్ రిజిస్టర్, డైస్ కోడ్ ఆధారంగా ఆయా సంస్థల్లో పని చేస్తున్నట్లుగా ధ్రువపత్రాలు సమర్పించాలి. ఉన్నత పాఠశాలల్లో పని చేస్తూ బీఈడీ విద్యార్హతలు గల ఉపాధ్యాయులే ఉపాధ్యాయ ఓటరుగా దరఖాస్తుకు అర్హులు. ఆన్‌లైన్‌లో సీఈఓ ఆంధ్ర సైట్‌లో కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా పూర్తి చేసిన ఫారం–19 దరఖాస్తులను తహసీల్దార్‌కు సమర్పించాలి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులైనా తాము పని చేస్తున్న మండలంలోనే కాకుండా ఏ మండలంలోని తహసీల్దార్లకై నా దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయులు విధిగా డీఈఓ సంతకంతో దరఖాస్తు చేయాల్సి ఉంది. దరఖాస్తు అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ జరిపే సమయంలో బీఎల్‌ఓలు కౌంటర్ సంతకంతో పాటు తగిన నిర్ధేశిత వివరాలు పొందుపర్చినదీ, లేనిదీ పరిశీలిస్తారు.
ఏమేం కావాలంటే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు పాస్‌పోర్ట్ ఫొటో, ఆధార్ నంబరు, ఓటరు ఐడీ కార్డు నంబరు, సర్వీసు సర్టిఫికెట్ ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించే సమయంలో ఫొటోతో పాటు సర్వీసు సర్టిఫికెట్‌ను స్కాన్ చేయడంతో పాటు ఎన్నికల కమిషన్ అడిగిన వివరాలు పూరించాలి. అదే విధంగా భౌతికంగా ఫారం–19 దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ ఫొటో, ఆధార్, ఓటరు ఐడీ కార్డు నంబర్లను నమోదు చేసి, సర్వీసు సర్టిఫికెట్ ఒక్కటే జిరాక్స్ సమర్పించాలి. గత ఎన్నికల సమయంలో 13,505 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కాగా, ప్రస్తుత ప్రక్రియలో ఇప్పటివరకు 10,909 దరఖాస్తు చేసుకున్నారు.
గుంటూరు వెస్ట్: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు కావడానికి శుక్రవారం వరకు మాత్రమే గడువు ఉందని కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్వో షేక్ ఖాజావలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కరోజు మాత్రమే గడువు ఉందని, అర్హులైన ఉపాధ్యాయులు వెంటనే ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించడం జరుగుతుందని, గతంలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం కొత్తగా ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల సమయంలో 13,505 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కాగా, ప్రస్తుత నమోదు ప్రక్రియలో ఇప్పటి వరకు 10,909 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. గత ఎన్నికల గణాంకాలతో పోలిస్తే ఇంకా సుమారు 2,600 మందికి పైగా అర్హులైన ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ గడువు తేదీ, నవంబరు 6వ తేదీ లోగా ఫారం–19 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటి వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం దరఖాస్తులు సమర్పించగా, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు దరఖాస్తుకు సంబంధించిన తుది గడువు ముగియనుండటంతో గత నాలుగు రోజులు వ్యవధిలో వివిధ మండలాల తహసీల్దార్లకు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. బీఈడీ అర్హతలు లేకున్నా దరఖాస్తులను ఆమోదించాలని తహసీల్దార్లపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అర్హత గల ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిన ఎమ్మెల్సీ ఓటరు జాబితాలోనూ బోగస్ ఓటర్లను నమోదు చేయించేందుకు కూటమి ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రయత్నిస్తున్నారు. బోధనతో సంబంధం లేని నాన్ టీచింగ్ స్టాఫ్‌ను సైతం ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, బీఈడీ అర్హతలతో పాటు మూడేళ్ల సర్వీసు నిబంధన పరిగణలోకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


