కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మూడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మండలంలో 15.2 మిల్లీ మీటర్లు, తుళ్లూరు 2 మి.మీ. పొన్నూరు మండలంలో 1.8 మి.మీ వర్షం కురిసింది.
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో శనివారం మంగళగిరిలోని డాన్‌బాస్కో హైస్కూలులో జిల్లా స్థాయి జూడో సబ్ జూనియర్ ఎంపికలు జరుగుతాయని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అప్పికట్ల శ్రీహరి నాయుడు, బి.కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 2012 నుంచి 2014 లోపు జన్మించిన వారై ఉండాలన్నారు. క్రీడాకారులు తమ వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు తీసుకొని మధ్యాహ్నం 2 గంటలకు డాన్‌బాస్కో హైస్కూల్లో హాజరు కావాలని తెలిపారు.
పెదకాకాని: మండల పరిధిలోని వెనిగండ్ల–2 సెగ్మెంట్‌లో పోలింగ్ గురువారం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. పెదకాకానిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉన్న 71 పోలింగ్ బూత్‌లలో సకాలంలో ఎన్నికల నిర్వహణ ముగియగా వెనిగండ్ల ఎస్సీ కాలనీలో మాత్రం సాయంత్రం 5 గంటల సమయానికి 100 మందికి పైగా ఓటర్లు క్యూలైన్‌లో ఉన్నారు. దీంతో పోలింగ్ బూత్ ప్రహరీ గేటుకు తాళం వేసిన సిబ్బంది క్యూలైన్‌లో ఉన్న 100 మందికి టోకెన్‌లు ఇచ్చారు. ఈ పోలింగ్ బూత్‌లో ఓటింగ్ నిర్వహణ రాత్రి 7 గంటల వరకూ కొనసాగింది.
దుగ్గిరాల: దుగ్గిరాల మండలంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేస్తూ.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన జరిగింది. మండలంలోని మోరంపూడి, గొడవర్రు, మంచికలపూడి, తుమ్మపూడి గ్రామాల్లో పలువురు గంజాయి సేవించిన యువకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ చేతల్లో కర్రలతో హల్‌చల్ చేశారు. అడిగినవారిపై, అడ్డుకున్న వారిపై దాడులకు దిగడమే కాకుండా, అధికార పార్టీ తరఫున రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వీరిని వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి, వారిని చెదరగొట్టారు.
క్రోసూరు: మండలంలోని దొడ్లేరు గ్రామంలో 18 వార్డు పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న పీహెచ్‌సీ ఉద్యోగి, పోలింగ్ అధికారి నూతక్కి దిలీప్ చక్రవర్తి అకస్మాత్తుగా అస్వస్ధతకు గురయ్యారు. వెంటనే పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ మేరీశ్రీకళ, శిఖాశ్యాంసన్ ప్రాథమిక చికిత్స అందించి సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఏఎస్పీ...
మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి పరిశీలించారు. పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను పెట్టినట్లు తెలిపారు.
ముప్పాళ్ళ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి చెప్పారు. మండలంలోని ముప్పాళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. మండలంలోని నార్నెపాడు, లంకెలకూరపాడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యాత్మక, అత్యంత సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.


