వైఎస్సార్‌ సీపీ నేతలపై లాఠీచార్జ్‌ దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేతలపై లాఠీచార్జ్‌ దుర్మార్గం

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

వైఎస్సార్‌ సీపీ నేతలపై లాఠీచార్జ్‌ దుర్మార్గం

బ్యాలెట్‌ బాక్స్‌ మార్చేందుకు సీఐ కుట్ర అడ్డుకున్నందుకు బరితెగించిన పోలీసులు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రత్తిపాడు వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త బలసాని

గుంటూరు రూరల్‌: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వెంగళాయపాలెం 1 ఎంపీటీసీకి చెందిన బ్యాలెట్‌ బాక్స్‌ను అక్రమంగా మార్చేందుకు కుట్ర జరుగుతుండగా, దాన్ని గుర్తించి నిరసనకు దిగిన సమయంలో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారని మండిపడ్డారు. ఎలాంటి సమాధానం చెప్పకుండా బ్యాలెట్‌ బాక్స్‌ను తీసుకెళ్లారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో బ్యాలెట్‌ బాక్స్‌లు మార్చారనేందుకు ఈ సంఘటనే సాక్ష్యమని తెలిపారు. బస్సులో తరలిస్తున్న బ్యాలెట్‌ బాక్స్‌లను అక్రమంగా మార్చేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పోలీసులు తమకు సంబంధం లేదని సమాధానం చెబుతున్నారని, సీఐ అత్యంత క్రూరంగా ప్రవర్తించారని విమర్శించారు. బ్యాలెట్‌ బాక్స్‌లు తరలించే బస్సుకు కనీసం ఎస్కార్ట్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. కావాలనే సీఐ కుట్రపన్ని బాక్స్‌ను మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రంలో రిగ్గింగ్‌కు అవకాశం లేకపోవడంతో ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఒక్క అధికారి కూడా సమాధానం చెప్పకపోగా, వైఎస్సార్‌ సీపీ నాయకులపై లాఠీచార్జ్‌ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ ఘటనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహిళలపై కూడా అక్రమంగా లాఠీచార్జ్‌ చేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. పోలీసులే టీడీపీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఉదయం నుంచే రిగ్గింగ్‌ ప్రయత్నం

వైఎస్సార్‌ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ, నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ భాస్కర్‌ మద్యం మత్తులో ఉదయం నుంచే పోలింగ్‌ బూత్‌ల వద్దకు వైఎస్సార్‌ సీపీ నాయకులను రానివ్వకుండా రిగ్గింగ్‌కు ప్రయత్నించారని ఆరోపించారు. సీఐ బ్యాలెట్‌ బాక్స్‌లను మార్చేందుకు కుట్ర పన్నారని తెలిపారు. మద్యం మత్తులో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రిగ్గింగ్‌ కుదరకపోవడంతో బ్యాలెట్‌ బాక్స్‌ను మార్చేందుకు కుట్ర పన్నారని, ఇది సభ్య సమాజం తలదించుకునే సంఘటన అని పేర్కొన్నారు. విచక్షణారహితంగా లాఠీచార్జ్‌ చేయడం హేయమైన చర్య అని అన్నారు. టీడీపీ కావాలనే కుట్రలు పన్ని, సీఐ భాస్కర్‌ ఒక నాయకుడిగా వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు గులాం రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement