అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలు

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ

టీడీపీ నేతల అక్రమాలకు చేబ్రోలు ఎస్‌ఐ వీరనారాయణ అండ నిజాలు కవర్‌ చేయకుండా మీడియాకు నో ఎంట్రీ అధికారుల తీరుపై వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆగ్రహం ఉన్నతాధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ఆర్‌ఓకు అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు

చేబ్రోలు: చేబ్రోలు మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు. నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం తీవ్ర కలకలం రేపింది. ఒకవైపు అధికార టీడీపీ నాయకులకు రాచమర్యాదలతో లోపలికి అనుమతినిస్తూ, మరోవైపు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన మీడియా ప్రతినిధులను అడ్డుకోవడంపై పలు అనుమానాలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

టీడీపీ కార్యకర్తలా చేబ్రోలు ఎస్‌ఐ

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సందర్భంగా అంగన్‌వాడీ, సచివాలయ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ నాయకులు యత్నించారు. మండల పరిషత్‌ అధికారులు, సిబ్బంది కూడా వీరికి పూర్తిస్థాయిలో సహకరించడంతో బ్యాలెట్‌ కేంద్రం కాస్తా టీడీపీ కార్యాలయంగా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు ఆళ్ల శ్రీరామిరెడ్డి తదితర నాయకులు ఈ అక్రమాలపై ప్రశ్నించగా, టీడీపీ నాయకులు జ్యోకం చేసుకోవటంతో వివాదం జరిగింది. రిటర్నింగ్‌ అధికారి కోమలి పద్మ కార్యాలయం బయటకు వచ్చి అందరిని కార్యాలయం బయట వరకు పంపాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు అందరిని బయటకు పంపివేశారు. అయితే తెనాలిలో ఉన్న చేబ్రోలు ఎస్‌ఐ పి.వీరనారాయణ వచ్చి రావటంతోనే అత్యుత్సాహం ప్రదర్శించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గుంపులుగా ఉన్న టీడీపీ నాయకులను పట్టించుకోకుండా కేవలం వైఎస్సార్‌ సీపీ నాయకులను మాత్రమే భయబ్రాంతులకు గురిచేస్తూ జీబీసీ రోడ్డు వరకు పంపివేశారు. ఇదే సమయంలో కొంతమంది టీడీపీ నాయకులు పోస్టల్‌ బ్యాలెట్‌ జరిగే కేంద్రంలోకి వెళ్లారు. టీడీపీ నాయకులు లోపలే ఉండగా, వైఎస్సార్‌ సీపీ నాయకులను మాత్రమే బయటకు వెళ్లాలంటూ లాఠీలు చూపిస్తూ ఎస్‌ఐ బెదిరింపులకు దిగారు. వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు ఆళ్ల శ్రీరామిరెడ్డిని ఏకవచనంతో ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించడాన్ని వైఎస్సార్‌ సీపీ నేతలు తీవ్రంగా నిరసించారు.

నిజాలు దాచేందుకు మీడియాపై ఆంక్షలు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరిగే కార్యాలయం లోపల జరుగుతున్న దందాను, అక్రమాలను కవరేజ్‌ చేసేందుకు వెళ్లిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులను ఎస్‌ఐ వీరనారాయణ అడ్డుకున్నారు. ‘లోపలికి రావడానికి వీల్లేదు’ అంటూ విలేకరులతో దౌర్జన్యంగా ప్రవర్తించారు. అధికార పార్టీ నాయకులు కార్యాలయంలో తిష్టవేసి అక్రమాలకు పాల్పడుతున్నా చోద్యం చూసిన పోలీసులు మీడియాకు మాత్రం ఆంక్షలు విధించటం వెనుక పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉందని స్పష్టమవుతోంది.

సమాచారం అందుకున్న వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ చేబ్రోలు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌ శర్మ అందుబాటులో లేకపోగా, ఎస్‌ఐ పి.వీరనారాయణ టీడీపీ నాయకులతో కలిసి కార్యాలయంలో కూర్చుని ఉండటం చూసి ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారి ఒక పార్టీకి ఏజెంట్‌లా మారడంపై మురళీకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం ఆయన రిటర్నింగ్‌ అధికారి కోమలి పద్మను కలసి, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రంలో జరుగుతున్న అక్రమాలు, ఎస్‌ఐ ఏకపక్ష వైఖరిపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, వైఎస్సార్‌ సీపీ నాయకులను బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్‌ఐ వీరనారాయణపై జిల్లా ఉన్నతాధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement