3.1 కిలోల గంజాయి, కారు స్వాధీనం
మంగళగిరి రూరల్/నగరంపాలెం: పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి వ్యాపారంలోకి దిగి చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మంగళగిరి మండల పరిధిలోని కాజలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. మండల పరిధి కాజ గ్రామానికి చెందిన చదల నందమయ్య విజయవాడకు చెందిన వెనిగళ్ల పద్మ వద్ద నాలుగు కిలోల గంజాయిని రూ.68 వేలకు కొనుగోలు చేశాడు. మంగళగిరి, విజయవాడ, కాజ ప్రాంతాల్లోని యువకులను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన పప్పు ఉమానాగు, కావర్ల షణ్ముఖ్, కట్టా మహేష్, మొగిలిశెట్టి లక్ష్మణ్ కళ్యాణ్, వల్లెపు వెంకటేష్ అలియాస్ వెంకటేశ్వరరావు, కుప్పాల శ్రీనివాస్, కృష్ణా జిల్లా మంటాడకు చెందిన కోడెబోయిన రంజిత్, తాడికొండకు చెందిన తాడిబోయిన కోటేశ్వరరావుతో కలిసి ముఠాగా ఏర్పడి అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి కాజా సమీపంలోని వెంకటరెడ్డిపాలెం జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారంతో మంగళగిరి రూరల్ పోలీసులు దాడులు చేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వీరి నుంచి 3.1 కిలోల గంజాయి, కారు, తూకం వేసే కాటా మెషిన్, ప్యాకింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.62 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముఠాలో ఆరుగురికి గతంలో నేర చరిత్ర ఉండగా, ముగ్గురు రౌడీషీటర్లుగా ఉన్నట్లు వెల్లడించారు. గంజాయి సరఫరాకు సంబంధించి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడకు చెందిన వెనిగళ్ల పద్మ, పిడుగురాళ్లకు చెందిన ఆకాష్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన నార్త్ డీఎస్పీ కె.వెంకటేశ్వర్లు, మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్, పోలీసు సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.
నేడు వేతనంతో కూడిన సెలవు
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో ఆదివారం మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని షాపులు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసిందని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆశారాణి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘనపై 9492555140 నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేస్తే వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.


