జిల్లాలో 1827 మంది సిబ్బందితో భద్రత అల్లర్లు స్పష్టించే 2500 మందిపై బైండోవర్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రాల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు, తెనాలి మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా బందోబస్త్‌కు హాజరైన పోలీస్ అధికార, సిబ్బంది విధులపై శనివారం గుంటూరు నగరంపాలెంలోని పోలీస్ కవాతు మైదానంలో బ్రీఫింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు నగర పరిధిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 61 రూట్ మొబైల్స్, 28 స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, 11 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు నియమించామన్నారు. 22 హైపర్ సెన్సిటివ్ లొకేషన్లలో 108 పోలింగ్ కేంద్రాలు, 8 సెన్సిటివ్ లొకేషన్లలో 29 పోలింగ్ కేంద్రాలు, 147 నార్మల్ లొకేషన్‌న్లలో 377 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 199 లొకేషన్లు, 596 పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశామన్నారు. తెనాలిలో 18 రూట్ మొబైల్స్, 6 స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, రెండు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను కేటాయించామని అన్నారు. 30 హైపర్ సెన్సిటివ్ లొకేషన్లలో 111 పోలింగ్ కేంద్రాలు, 11 సెన్సిటివ్ లొకేషన్లల్లో 27 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. 38 నార్మల్ లొకేషన్లలో 129 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.
● ఎన్నికల బందోబస్త్‌కు ఇద్దరు జిల్లా ఏఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 34 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, 217 మంది ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు, 370 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 84 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, 185 మంది హోంగార్డులు, 475 మంది డబ్ల్యూఎంఎస్‌కే సిబ్బంది, 190 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, 184 మంది ఎన్‌సీసీ వలంటీర్లతోపాటు మొత్తమ్మీద 1,827 మందితో పోలీస్ బందోబస్త్ నియమించామని అన్నారు.
● జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీస్ బలగాలు, ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. గుంటూరు, తెనాలిలో 2,500 మందిని బైండోవర్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్, పోలింగ్ కేంద్రాలకు వందమీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఎలాంటి పక్షపాతం చూపవద్దని, ఏ రాజకీయ పార్టీల నుంచి తినుబండారాలు, వస్తువులు స్వీకరించవద్దని జిల్లా ఎస్పీ స్పష్టంచేశారు.


