చట్టపరమైన చర్యలు | - | Sakshi
Sakshi News home page

చట్టపరమైన చర్యలు

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే

నగరంపాలెం: జిల్లాలో ఎన్నికల ప్రచార గడువు ముగిసిందని, గడువు ముగిశాక ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఓటర్లకు నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీతో ప్రలోభాలకు గురిచేయడం నేరమని అన్నారు. ఇటువంటి దృశ్యాలు స్థానికంగా ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఓటర్లను జిల్లా ఎస్పీ కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలతో సంబంధం లేని బయటి వ్యక్తులకు అనుమతుల్లేవని స్పష్టంచేశారు. ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు/ అపోహలుంటే పోలీస్‌ అధికారులను సంప్రదించాలని చెప్పారు. తద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు/ మద్దతుదారులు పరస్పరం సంయమనం పాటించాలని చెప్పారు. ఎన్నికల్లో ఘర్షణలకు, అవాంఛనీయ ఘటనలకు అవకాశం కల్పించవద్దని అన్నారు. గుంటూరు, తెనాలిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను ప్రతిఒక్కరూ పాటిస్తూ, పోలీస్‌ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

దూరవిద్యా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యా విధానంలో విద్యను పొందేలా వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభించినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎ మణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దూర విద్య ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో సేంద్రియ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, చిరుదాన్యాల ఉత్పత్తి ఆధారిత విలువల జోడింపు వంటి 8 వారాల (2నెలల) కోర్సులకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ 1500 చొప్పున ఫీజు చెల్లించి కోర్సుకు పేరు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ సదుపాయం కంప్యూటర్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌, ఐపాడ్‌ కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్‌ 16వ తేదీ ఆఖరు తేదీగా నిర్ణయించారన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను కానీ, 7036689346, 8096085560 సెల్‌ నంబర్లకు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకూ మాత్రమే కాల్‌చేసి నమోదు చేసుకోవాలన్నారు.

నల్లబెల్లం తరలిస్తున్న వాహనం సీజ్‌

ఇద్దరిపై కేసు నమోదు

నెల్లికుదురు: అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న వాహనం సీజ్‌ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేసిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా, నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి వెళ్లే క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై జి.కరుణాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శ్రీరామగిరి గ్రామం వెళ్లే క్రాస్‌ రోడ్డు వద్ద తనిఖీ చేస్తుండగా కారులో తొమ్మిది క్వింటాళ్ల నల్లబెల్లం, 20కిలోల పటిక, 5లీటర్ల గుడుంబా ఉన్నట్లు గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తిని విచారించగా.. మంగళగిరికి చెందిన పరుచూరి రాకేష్‌మనోహర్‌, నెల్లికుదురు మండలం జామతండాకు చెందిన గుగులోతు నాగేష్‌తో కలిసి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. కారును సీజ్‌ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న నాగేష్‌ కోసం గాలిస్తున్న ఎస్సై వివరించారు.

బీఎస్సీ, బీటెక్‌ అభ్యర్థులకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికిగానూ బైపీసీ విభాగంలో ఏపీ ఎంసెట్‌ 2026 ర్యాంకుల ద్వారా బీఎస్సీ హానర్స్‌ అగ్రికల్చర్‌, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీలో ప్రవేఽశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నవంబర్‌ 2వ తేదీన ఉదయం జరుగుతుందని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎ మణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్పెషల్‌ కేటగిరి పీడబ్ల్యూబీడీ, ఎన్‌సీసీ, స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌, గేమ్స్‌, కాప్‌ అభ్యర్థులకు మధ్యాహ్నం నుంచి ఏపీ ఎంసెట్‌ ద్వారా మిగిలిన సీట్ల భర్తీకి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. 3వ తేదీనుంచి 11వ తేదీ వరకూ ఎన్నికలు, పండుగల సెలవుల కారణంగా కౌన్సెలింగ్‌ జరగదని తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement