ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో జయ స్కందకు చోటు | - | Sakshi
Sakshi News home page

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో జయ స్కందకు చోటు

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

● చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ ● 75 దేశాలు.. 50 దేశాల జెండాలను సొంతంగా అమర్చి రికార్డు

మంగళగిరి టౌన్‌: చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ మంగళగిరికి చెందిన ఎల్‌కేజీ విద్యార్థి బిశ్వజిత్‌ జయ స్కంద జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. మంగళగిరిలోని బచ్‌పన్‌ – ఏహెచ్‌పీఎస్‌ పాఠశాలలో చదువుతున్న ఈ చిన్నారి తన అద్భుత నైపుణ్యంతో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌–2026’లో చోటు సంపాదించుకున్నాడు. చిన్నారులకు ఆటపాటలే ప్రపంచంగా ఉండే వయసులోనే బిశ్వజిత్‌ తన జ్ఞాపకశక్తి, పరిశీలనా సామర్థ్యం, భౌగోళిక అంశాలపై ఆసక్తిని చాటుకున్నాడు. ప్రపంచ పటం, ఐరోపా ఖండానికి సంబంధించిన మ్యాప్‌లలో మొత్తం 75 దేశాలను, అలాగే 50 దేశాల జెండాలను ఎవరి సహాయం లేకుండా స్వయంగా గుర్తించి అమర్చడం ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

వీడియో ద్వారా రికార్డులకు దరఖాస్తు..

బాలుడిలోని అసాధారణ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు లక్ష్మీ భార్గవి, రామకృష్ణ అతడి నైపుణ్యాన్ని వీడియో రూపంలో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌–2026కు పంపించి రికార్డు కోసం దరఖాస్తు చేశారు. దీనిని పరిశీలించిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తరుపున ప్రతినిధులు సుమారు పది రోజుల క్రితం పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ చిన్నారి ప్రతిభను ప్రత్యక్షంగా పరీక్షించి, సంబంధిత నివేదికను తదుపరి పరిశీలన కోసం ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు పంపించారు.

శుక్రవారం రికార్డు ప్రకటన..

పాఠశాలలో నిర్వహించిన ప్రతిభా పరీక్షకు సంబంధించిన నివేదికను పరిశీలించిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు శుక్రవారం బిశ్వజిత్‌ జయ స్కందకు రికార్డుల్లో స్థానం కల్పిస్తూ అవార్డును ప్రకటించినట్లు బాలుడి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం మీడియాకు తెలిపారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో బాలుడి స్ధానం కల్పించడంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఎల్‌కేజీ చదువుతున్న దశలోనే ప్రపంచ దేశాల పటాలు, జాతీయ జెండాలపై అవగాహన కలిగి ఉండటం విశేషమని పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement