● తెరవెనుక చక్రం తిప్పుతున్న టీడీపీ
సామాజిక వర్గం యంత్రాంగం
● వార్డుల పునర్విభజన నుంచి
రిజర్వేషన్ల వరకు ముందస్తు లీకులు
● జీఎంసీ మేయర్ ఎన్నిక ఏకపక్షం
చేసే అవకాశం ఉందని ఆందోళన
● జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు
తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గతంలో జీఎంసీ మేయర్‌గా పనిచేసిన కోవెలమూడి రవీంద్ర వద్ద పనిచేసిన అనుభవం ఉన్న కౌన్సిల్ సెక్రటరీ బి. శ్రీనివాసరావుకు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను నగరపాలక సంస్థ తరఫున అప్పగించారు. మరోవైపు, కూటమి మేయర్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన ఓ అధికారిని ఏఈఆర్వోగా నియమించారు. వీరితో పాటు కార్యాలయంలోని మరికొందరు అధికార పార్టీకి చెందిన అదే సామాజిక వర్గ అధికారులు కూడా వీరికి తోడయ్యారు. ఇలా అధికార పార్టీకి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన కీలక అధికారులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునే కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి.
టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్న ఈ అధికారులు ఎన్నికల నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన అత్యంత గోప్యమైన ‘ప్రియాంబుల్ కాపీ’ని అనధికారికంగా వాట్సాప్ గ్రూపుల్లోకి విడుదల చేసి హల్‌చల్ సృష్టించారు. వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని క్షణాల వ్యవధిలో అధికార పార్టీ నేతలకు చేరవేశారు. వారికి ముందస్తు వ్యూహాలు సిద్ధం చేసుకునేలా వెసులుబాటు కల్పించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులే కూటమి అభ్యర్థుల విజయానికి ప్రయత్నించడం పారదర్శకతను ప్రశ్నార్థకం చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నాయి. లేదంటే ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు ఎత్తుగడలు సిద్ధం చేసుకుంటారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఇకనైనా కలెక్టర్ స్పందించి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థిని ఏకపక్షంగా గెలిపించడమే లక్ష్యంగా కొందరు అధికారులు బరితెగించారు. నిబంధనలను, ప్రజాస్వామ్య విలువలను గాలికొదిలారు. అధికార పార్టీకి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులు అంతా ఒక్కటయ్యారు. తెరవెనుక ఉండి జీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థి విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారు.
అధికార వర్గాల ఈ పక్షపాత వైఖరిపై ‘సాక్షి’లో ఈ నెల 15వ తేదీన వచ్చిన ‘అధికార పచ్చపాతం’ అనే కథనం స్థానిక రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, నగర కమిషనర్ మయూర్ అశోక్‌లు.. జీఎంసీ కౌన్సిల్ గుమాస్తా నాగరాజును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై మరింత లోతైన విచారణ చేపడితే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని బెంబేలెత్తిపోయిన ఆ అధికారి, హడావుడిగా తన మొబైల్ సిమ్ కార్డును ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన స్వర్ణ వార్డు సచివాలయ విభాగం అదనపు కమిషనర్ రవీంద్రకు ఇచ్చేశారు. తప్పు చేయనప్పుడు సిమ్ మార్చాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టి, ఆ అధికారి వాట్సాప్ చాట్‌లపై పోలీసు విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు.


