అయ్యయ్యో.. బీఫారం పాయే! | - | Sakshi
Sakshi News home page

అయ్యయ్యో.. బీఫారం పాయే!

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

అయ్యయ్యో.. బీఫారం పాయే!

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కూటమిలో ‘అవకాశవాద’ నేతలు శీర్షికన బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఈనెల 23న ప్రచురితమైన వార్తా కథనానికి స్పందన లభించింది. బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షుడు ఊసా రాజేష్‌కు టీడీపీ నుండి చుక్కెదురైంది. జనసేన పార్టీకి చెందిన రాజేష్‌, ఓసీ (మహిళ)కు రిజర్వు చేసిన ఎంపీపీ పదవిపై కన్నేశారు. సొంతూరు చావలిలో ఓసీ మహిళకు కేటాయించిన ఎంపీటీసీ స్థానంలో తన భార్య నాగజ్యోతిని పోటీ చేయించాలని భావించారు. గ్రామస్తులకు మూడురోజులపాటు విందుభోజనాలు పెట్టారు. గ్రామంలోని సొసైటీ అధ్యక్షుడిగా ఉంటూ పలు అవినీతి, అక్రమాలకు పాల్పడిన రాజేష్‌కు, ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. విషయం తెలిసిన రాజేష్‌, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సహకారంతో అదే మండలంలోని పోతుమర్రు ఎంపీటీసీ స్థానం నుంచి పోటీకి రంగం సిద్ధంచేసుకున్నారు. ఈనెల 22వ తేదీన తన భార్యకు టీడీపీ కండువా కప్పించి, నామినేషను వేయించారు. పొతుమర్రు, బూతుమల్లి, చంపాడు పరిధిగా గల ఆ ఎంపీటీసీ పరిధిలోని తెలుగుదేశం నాయకులు కూడా రాజేష్‌ గురించి తెలిసి, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరుసటిరోజు ‘సాక్షి’లో ఈ అవకాశవాద రాజకీయాలపై ప్రచురించిన వార్తాకథనం అటు టీడీపీ, జనసేన వర్గాల్లో కలకలం సృష్టించింది. దీనితో టీడీపీ రాజేష్‌ భార్య నాగజ్యోతికి పార్టీ బీఫారం ఇచ్చేందుకు నిరాకరించింది. చేసేదిలేక మంగళవారం ఆమె తన నామినేషనును ఉపసంహరించుకున్నారు. ఇదిలావుంటే, సొంతూరు చావలిలో సొంత పార్టీ జనసేన తరపున పోటీచేస్తున్నవారు కూడా ‘మా ప్రచారానికి మీరు రావొద్దు’ అంటూ ఈ దంపతులకు కబురుపెట్టారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement