నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో ఆప్కాస్ విధానంలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న బందెల దేవకుమారిపై చర్యలకు నగర కమిషనర్ మయూర్ అశోక్ ఆప్కాస్ ఎండీకి సిఫార్సు చేశారు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నగరపాలక సంస్థ ఎన్నికలలో 8వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. దీనిపై సాక్షి దినపత్రికలో ఈ నెల 26వ తేదీన ‘ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్’ అనే శీర్షిక కథనం ప్రచురితమైంది. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడమే కాకుండా, అక్టోబర్ 19 నుంచి విధులకు గైర్హాజరైనట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆప్కాస్ సిబ్బంది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఆమెను ఆప్కాస్ జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి కోరుతూ నగర కమిషనర్ నివేదికను ఎండీకి సమర్పించారు.
నెహ్రూనగర్: గుంటూరు–2 ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలలో గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ (డీఈఓ) వి.అరుణకుమారి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో రికార్డుల నిర్వహణ, నిల్వలు, ఎమ్మార్పీ నిబంధనల అమలు, అలాగే ఏమైనా అక్రమ విక్రయాలు జరుగుతున్నాయా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు–2 స్టేషన్ సీఐ నరసింహారావు, ఎస్‌ఐ మూర్తి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదనే ఎన్నికల కమిషన్ నిబంధనలను కొందరు ఖాతరు చేయడం లేదు. మెప్మాలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్(ఆర్‌పీ) ఎస్‌కె చాన్ సుల్తానా ఇటీవల 2వ డివిజన్‌లో టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.


