విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలి
గుంటూరు వెస్ట్: అర్నబ్ తుపాను కారణంగా బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా అత్యవసర పనులు ఉంటే మినహా బయటకు రావద్దని అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థలకు బుధవారం పరిస్థితిని సమీక్షించి సెలవు విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇప్పటికే మూడు రోజులపాటు సెలవు ప్రకటించామన్నారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, దీనిపై జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. అవసరమైతే ఇప్పటికే సిద్ధం చేసిన 34 పునరావాస కేంద్రాలకు ప్రజలను వెంటనే తరలిస్తామని తెలిపారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పూర్తి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. వాగులు, నదులు దాటవద్దన్నారు. సమస్యలు ఎదురైతే సంప్రదించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో (08632234014) కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు.
పరిస్థితిని బట్టి పాఠశాలలు,
కళాశాలలకు సెలవు
అంగన్‌వాడీ కేంద్రాలకు
మూడు రోజులపాటు సెలవు
విలేకరుల సమావేశంలో
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
ఆసుపత్రుల వద్ద ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్ల వద్ద ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించినట్లు తెలిపారు. హై రిస్క్ లో ఉన్న గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. వైద్య సేవలకు ఎటువంటి అంతరాయము ఉండరాదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పాల్గొన్నారు.


