నెహ్రూనగర్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే కేంద్రాల వద్ద కూటమి నేతలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గుంటూరులోని ఏసీ కాలేజీలో మంగళ, బుధవారాల్లో ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాల వద్ద టీడీపీ, ఇతర కూటమి పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బహిరంగంగానే ప్రయత్నాలు చేయడం గమనార్హం. ఓటు వేసేందుకు వచ్చే ఉద్యోగులకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు నగదు ఇస్తామంటూ బేరసారాలు సాగించారు. ఈ క్రమంలో కొంతమంది ప్రలోభాలకు తలొగ్గగా, మరికొంతమంది వాటిని తిరస్కరించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లను బహిరంగంగా ఇలా ప్రభావితం చేయడంపై ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చోద్యం చూసిన పోలీసులు
పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల గుర్తులు, కండువాలు ధరించి రావడానికి వీల్లేదన్న స్పష్టమైన ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. కూటమి నేతలు మాత్రం పసుపు కండువాలు, పార్టీ స్టిక్కర్లు, పసుపు చొక్కాలు ధరించి కేంద్రాల వద్ద దర్జాగా హల్‌చల్ చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కనీసం వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. పైగా కూటమి నేతలకు మద్దతుగా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న అధికార పార్టీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు నేడు ఆఖరి రోజు కావడంతో మరింత మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనైనా అధికారులు, పోలీసులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద హల్‌చల్
నగదు పంపిణీకి బహిరంగంగానే
ప్రయత్నం
దర్జాగా పార్టీ కండువాలు,
స్టిక్కర్లు ధరించి సంచారం
కనీసం పట్టించుకోని పోలీసులు,
ఎన్నికల అధికారులు


