ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

వేగంగా వంతెనల నిర్మాణం

● మెట్రో నగరాలకు దీటుగా

గుంటూరు అభివృద్ధి

● విలీన గ్రామాల్లో మౌలిక వసతుల

కల్పనకు కృషి

● నిరంతరాయంగా తాగునీటి

సరఫరాకు చర్యలు

● ‘సాక్షి’తో వైఎస్సార్‌ సీపీ మేయర్‌

అభ్యర్థి తాడికొండ శ్రీదేవి

నెహ్రూనగర్‌: తాను గెలిస్తే గుంటూరును దేశంలోనే ఆదర్శంగా నిలుపుతానని గుంటూరు మేయర్‌ పీఠానికి పోటీ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మ శ్రీదేవి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకై క అజెండాగా ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు. మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆమె మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ గుంటూరు మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ చరిత్రలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఆర్యవైశ్య మహిళకు మేయర్‌ అభ్యర్థిగా అవకాశం ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాకు అవకాశం కల్పించినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను.

తాగునీటి సమస్యపై దృష్టి

నగరంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ప్రచారంలో ప్రజలు చెబుతున్నారు. అధికారులతో సమీక్షించి నిరంతరం తాగునీరు అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. నగరపాలక సంస్థలో విలీనమైన పది గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు సమస్యల పరిష్కారంతోపాటు ప్రజారోగ్య పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటాను. అవసరమైన చోట తాగునీటి పైపులైన్లు, వాటర్‌ ట్యాంకులు నిర్మిస్తాం. నగర సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకు వెళతా.

అవినీతి నిర్మూలనకు చర్యలు

జీఎంసీలో అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకుంటా. సచివాలయాలను బలోపేతం చేసి, సిబ్బంది అక్కడే అందుబాటులో ఉండేలా చూస్తాను. సచివాలయ ఉద్యోగులకు అదనపు విధుల నుంచి విముక్తి కల్పించేలా చూస్తా. చ జీఎంసీ అప్కాస్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటాను.

ముంపు నుంచి రక్షణ ఏర్పాట్లు

అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ పేరుతో టీడీపీ ప్రభుత్వం రూ. వందల కోట్లను దుర్వినియోగం చేసింది. ఈ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తాను. వర్షం పడితే మూడు వంతెనలు, కంకరగుంట ఆర్‌యూబీ, శివారు కాలనీలు నీట మునుగుతూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇటీవల మూడు వంతెనల వద్ద ట్రాక్‌ ఎక్స్‌టెన్షన్‌ చేశారు. అయినప్పటికీ మురుగు సమస్య అలాగే ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు రైల్వే అధికారులతో మాట్లాడతా. కంకరగుంట ఆర్‌యూబీ, ఇతర నీట మునిగే శివారు ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం చూపుతాను.

నగరంలో కీలక ప్రాజెక్టుల్లో ఒకటైన పీవీకే నాయుడు మార్కెట్‌ పునర్నిర్మాణం చేపట్టి వ్యాపారులకు మేలు చేస్తాను. వెన్‌లాక్‌ మార్కెట్‌లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కరిస్తా. పార్కులను సుందరీకరిస్తా. గడ్డిపాడు ఆర్‌ఓబీ, శ్యామలనగర్‌, నెహ్రూనగర్‌, సంజీవయ్యనగర్‌ రైల్వే గేట్ల వద్ద ఆర్‌ఓబీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాను. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సెల్లార్లను పార్కింగ్‌ కోసమే వినియోగించేలా చూస్తాను. రోడ్లపై తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసేవారి కోసం ప్రత్యేక వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేయిస్తా. ప్రధాన కూడళ్ల వద్ద టాయిలెట్ల నిర్వహణకు కృషి చేస్తాను. వలస కూలీలకు సదుపాయాలు కల్పిస్తా. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన తెల్లాకుల జాలయ్య మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన గుర్తుగా నగరంలో నిర్మించే బ్రిడ్జిల్లో ఒకదానికి ఆయన పేరు పెట్టేందుకు కృషి చేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement