‘దాక్షిణ్య’ మూర్తి ఇకలేరు | - | Sakshi
Sakshi News home page

‘దాక్షిణ్య’ మూర్తి ఇకలేరు

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

● చికిత్స పొందుతూ విజయవాడలో మృతి ● నేడు తెనాలిలో అంత్యక్రియలు ● తక్కువ ఖర్చుతో వైద్యం ● వైద్యవిజ్ఞానం, సాహిత్యం, సినిమా రచనలతో సమాజానికి విలువైన సేవలందించిన డాక్టర్‌ దక్షిణామూర్తి

అవార్డులు.. రివార్డులు

తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ పాటిబండ్ల దక్షిణామూర్తి (87) మృతిచెందారు. వైద్యం, వైద్యవిజ్ఞానం, సాహిత్యం, సినిమా రచనలు, సాహితీ వ్యాసంగాలతో బిజీగా గడుపుతుండే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న వైద్యవృత్తిలో సొంత లాభం మానుకుని రోగుల స్వస్థత లక్ష్యంగా పనిచేశారు డాక్టర్‌ దక్షిణామూర్తి. తెలిసినవారంతా ’దాక్షిణ్య’మూర్తి అంటారు. ఇంటికి పెట్టిన పేరు ’సహృదయ’. ఆయనకు సార్ధక నామధేయం. పేదల డాక్టరుగా సుపరిచితులు. 1939 సెప్టెంబర్‌ 2న ఉమ్మడి కృష్ణాజిల్లా గుంటుపల్లిలో జన్మించారు. గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేశారు. 1965లో ఎండీ పూర్తిచేశారు. అదే కాలేజిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, అసిస్టెంట్‌ ఫిజిషియన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1970–73లో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్‌ సర్జన్‌గా చేశారు. 1973లో తెనాలిలో గీతా నర్సింగ్‌ హోమ్‌ను స్థాపించారు. తెనాలిలో ఆయనే తొలి ఎండీ (ఫిజిషియన్‌). 1979లో గుండె జబ్బులకు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (కార్డియాక్‌ మానిటర్‌, డీఫిబ్రిలేటర్‌) ప్రారంభించారు. అత్యవసర వైద్యంకోసం తీసుకొచ్చిన రోగికి, కౌంటర్లో డబ్బు చెల్లిస్తేనే నాడి చూసే డాక్టర్లకు భిన్నంగా క్షణం వృథా చేయకుండా వైద్యం అందించారు. అతి చౌకై న మందులతోనే చికిత్స చేస్తూ వచ్చారు. తనకు తెలిసిన వైద్యవిజ్ఞానంతో పత్రికలకు వైద్యవిజ్ఞాన వ్యాసాలనూ, పుస్తకాలనూ రాశారు. ‘డాక్టరుగారి డైరీ’, ‘వైద్యవిజ్ఞానం’, ‘డయాబెటీస్‌ గైడ్‌’, ‘గుండెజబ్బులు–నివారణ’, ‘అధిక రక్తపోటు’ పుస్తకాలు అందులో కొన్ని. 1981లో తెనాలిలో డయాబెటీస్‌పై సమగ్ర సర్వే చేసి ముంబయిలో జరిగిన అంతర్జాతీయ డయాబెటిస్‌ సదస్సులో పత్రసమర్పణ చేశారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌, ఏపీ చాప్టర్‌కు అధ్యక్షుడిగా చేశారు. 2009లో గుండెజబ్బులపై చేసిన సర్వే, ఫిజిషియన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది

బహుముఖ ప్రజ్ఞాశాలి..

సినిమాపై ఆసక్తితో వాటి మంచీ చెడులను విశ్లేషిస్తూ వ్యాసాలు రాశారు. క్లాసికల్‌ ఫిలింసొసైటీ, చైతన్యవేదిక సంస్థలను స్థాపించి ఉత్తమ చిత్రాలను ప్రోత్సహించారు. ఉత్తమ దర్శకులు, రచయితలు బీఎన్‌ రెడ్డి, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, ఆరుద్ర, దాశరధి, కె.విశ్వనాథ్‌, సి.నారాయణరెడ్డి, భానుమతి వంటి ప్రముఖులను సత్కరించారు. ’తెలుగులో ఉత్తమ చిత్రాలు’, ’కళాత్మక దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి’, ‘గూడవల్లి రామబ్రహ్మం’ పుస్తకాలను రచించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులపై రాసిన వ్యాసాలతో రెండు సంపుటాలను తీసుకొచ్చారు.

1975 ప్రాంతాల్లో ‘కొరోనరీ క్లబ్‌’ను స్థాపించారు. 2000లో వాకర్స్‌ క్లబ్‌ను స్థాపించారు. నెలవారీ సమావేశాల్లో వైద్యవిజ్ఞాన ప్రసంగాలు, ఏటా వార్షికోత్సవంలో ఉత్తమ వాకర్స్‌ను సత్కరించారు. 2025లోఆ సంస్థ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం పెద్దకుమారుడు డాక్టర్‌ వేణుగోపాల్‌ ఫిజిషియన్‌గా గీతా నర్సింగ్‌హోమ్‌ నిర్వహిస్తున్నారు. కుమార్తె డాక్టర్‌ గీతాదేవి విజయవాడలో ప్రసిద్ధ గైనకాలజిస్ట్‌. రెండో కుమారుడు జితేంద్ర కొలంబస్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు.

వివిధ రంగాల్లో చేసిన కృషికిగాను డాక్టర్‌ దక్షిణామూర్తి పలు అవార్డులనూ అందుకున్నారు. 1999లో ఢిల్లీలోని తెలుగు అకాడమీచే సత్కారం అందుకున్నారు. 2002లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పురస్కారం, 2015లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం, 2017లో విజయవాడ రూట్స్‌ ఫౌండేషన్‌చే జీవితకాల సాధన పురస్కారం, 2021లో తెనాలి ఐఎంఏచే డాక్టర్‌ ఉళ్లక్కి స్మారక బంగారు పతకం, గుంటూరులో డాక్టర్‌ పరుచూరి రాజారామ్‌ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. ఐఎంఏ, తెనాలి శాఖలోలో ఏటా తన పేరిట ధర్మనిధి పురస్కారం కింద బంగారు పతకం ఉత్తమ వైద్యులకు ప్రదానం చేసేలా డాక్టర్‌ దక్షిణామూర్తి ఏర్పాటుచేశారు. వయోభారం కారణంగా 2026 నుంచి వైద్యవృత్తిని విరమించుకున్నారు. విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆయన మృతితో తొలి తరం ప్రముఖులతో పరిచయాలున్న ఒక తరం మనిషి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement