సబ్సిడీ విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ విడుదల చేయాలి

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

● నెలాఖరులోగా చెల్లించకుంటే నవంబర్‌ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష ● ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అనార్‌ బాబు హెచ్చరిక

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల

మంగళగిరి టౌన్‌: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్‌ సబ్సిడీలు, ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అనార్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళగిరి పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా సబ్సిడీల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొంత మొత్తాన్ని విడుదల చేసిన ప్రభుత్వం, మిగిలిన బకాయిల చెల్లింపుల్లో జాప్యం చేస్తోందని ఆరోపించారు. ప్రతి నెలా చెల్లింపులు చేస్తామని హామీలు ఇస్తూ వాయిదా వేస్తున్నారని విమర్శించారు. రూ.352 కోట్ల విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెబుతున్నప్పటికీ, తమకు రావాల్సిన సబ్సిడీలు ఇప్పటికీ అందలేదని పేర్కొన్నారు. సబ్సిడీలు అందక బ్యాంకు రుణాల వాయిదాలు చెల్లించలేకపోతున్నామని, దీంతో ఖాతాలు నిరర్థక ఆస్తులుగా మారే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.

పారిశ్రామికవేత్త కుటుంబాన్ని ఆదుకోవాలి..

పల్నాడు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ అప్పుల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనార్‌ బాబు తెలిపారు. ఆయన కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, భార్యకు ఉద్యోగం కల్పించాలని, పిల్లల విద్యకు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబం రుణభారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు.

వాహనాలు కొనుగోలు చేసి అప్పులపాలయ్యాం..

మహిళా విభాగం ప్రతినిధి మాధవి మాట్లాడుతూ, ఎంఎస్‌ఎంఈ రంగంలో వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో బ్యాంకు రుణాలు తీసుకుని వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. బస్సులు, లారీలు, టిప్పర్లను నడుపుతూ ఉపాధి కల్పించిన తామే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఉపాధి కోల్పోయే పరిస్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వి.నాగలక్ష్మి మాట్లాడుతూ, సబ్సిడీ పథకాన్ని నమ్ముకుని రెండు వాహనాలు కొనుగోలు చేశానని, ఐదేళ్లు గడిచినా తనకు రావాల్సిన సబ్సిడీ అందలేదని తెలిపారు. వాహనాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు బంగారం, ఇళ్లను సైతం తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు ధర్నాలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. పెండింగ్‌ సబ్సిడీలను వెంటనే విడుదల చేసి, అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కుటుంబాలను ఆదుకోవాలని సంఘ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. నెలాఖరులోగా చెల్లింపులు జరగకపోతే నవంబర్‌ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సత్తిబాబు, బుల్లబ్బాయి, లాజరు, హనుమంతరావు, విజయకుమార్‌, రాంబాబు నాయక్‌, పున్నారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement