తెనాలి: రాయపూర్‌లోని పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయంలో ‘అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా’ (ఏపీటీఐ) ఆధ్వర్యంలో జరిగిన 28వ జాతీయ ఏపీటీఐసీఓఎన్ సదస్సులో ఏపీటీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు 2026 సంవత్సరానికి బెస్ట్ కంట్రిబ్యూషన్ స్టేట్ బ్రాంచ్ అవార్డును ప్రదానం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఏపీటీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, స్థానిక ఏఎస్‌ఎన్. ఫార్మసీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకట రమణ స్వీకరించారు. ఈనెల 24, 25 తేదీల్లో జరిగిన సదస్సులో అందుకున్న గౌరవం వివరాలను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఫార్మసీ విద్య అభివృద్ధి, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం, ఫార్మసీ రంగంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలకు ఈ గుర్తింపు లభించటం, రాష్ట్రంలోని ఫార్మసీ విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు అందించిన సహకారం, ప్రోత్సాహంతోనే ఈ జాతీయ స్థాయి గుర్తింపు సాధించగలిగామన్నారు. ఏపీటీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ వై.అంకమ్మ చౌదరి, డాక్టర్ ఎ.లక్ష్మణరావు, కార్యదర్శి, పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ డి.నరేంద్ర, ఏపీటీఐ ఉమెన్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ కె.పద్మలత పాల్గొన్నారు.


