నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో శరీర అవయాలు తొలగించి లభించిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో భవానీపురానికి చెందిన నిందితుడు షేక్ షఫీని అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వెస్ట్‌జోన్ ఏసీపీ దుర్గారావు హత్యకు కారణాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 18న కాలువలో మహిళ మృత దేహం స్వాధీనం చేసుకున్న క్రమంలో సీపీ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారన్నారు. ఆసుపత్రులు, టాటూ సెంటర్‌లు, టోల్‌గేట్లు వద్ద సీసీ కెమెరాల పుటేజీలు, పత్రికలు, సోషల్ మీడియా వేదికగా మృతురాలి శరీరంపై దుస్తులు, చేతిపై నెమలి పించం టాటూ ప్రచారం చేసి మృతురాలిని గుర్తించినట్లు చెప్పారు.
సోదరుడు ఇచ్చిన సమాచారంతో..
ఆ ఆధారాలతో ఆమె సోదరుడు తన అక్కగా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమె మంగళగిరి ప్రాంతానికి చెందిన కర్రి దుర్గ ఆలియాస్ కళ్యాణిగా గుర్తించినట్లు తెలిపారు. విచారణలో స్వస్థలం ఏలూరు జిల్లా కలిదిండి మండలం తాటినాడగా గుర్తించారు. ఆమె మంగళగిరిలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ గౌస్ మొహిద్దీన్‌తో సహజీవనం చేసి ఒక బాబుకి జన్మనిచ్చినట్లు ఏసీపీ వివరించారు. గౌస్ మొహిద్దీన్‌కు ముందుగానే వివాహం కావడంతో అతడికి దూరమై భవానీపురం హెచ్‌బీ కాలనీకి చెందిన మటన్ దుకాణం యజమాని షేక్ షఫీతో పరిచయం పెంచుకుంది. ఆమె కుమారుడిని కూడా అతని వద్దే ఉంచి సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 17 షఫీతో డబ్బులు వ్యవహారంలో వివాదం రావడంతో ఆమెను వదిలించుకోవాలనే పక్కా ప్రణాళికతో కుటుంబ సభ్యులను ఊరికి పంపించి కళ్యాణిని ఇంటికి పిలిపించాడు.
మటన్ కొట్టే కత్తితో..
తన మిత్రుడు షేక్ అబ్దుల్లా(దుర్గారావు)తో కలిసి మటన్ కొట్టే కత్తితో దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు. ఆమె తల, కాళ్లు, చేతులు వేరు చేసి సంచిలో వేసుకుని బైక్‌పై వెళ్లి ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో పడేశారు. విచారణలో భాగంగా సీఐ సుబ్రహ్మణ్యం భవానీపురంలో ఉన్న నిందితుడు షేక్ షఫీని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ దుర్గారావు తెలిపారు. మరో నిందితుడు షేక్ అబ్దుల్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్‌ఐ సేనాపతి శ్రీనివాసరావు, ఎస్‌ఐలు రవివర్మ, సత్యవతి, చక్రధర్, సన్యాసి నాయుడిని సీపీ రాజశేఖర్‌బాబు అభినందించినట్లు ఏసీపీ దుర్గారావు పేర్కొన్నారు.


