గుంటూరు ఎడ్యుకేషన్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 35 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ప్రశ్నపత్రాన్ని ఆవిష్కరించిన కళాశాల డైరెక్టర్ పీఎం ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడంలో చెకుముకి సైన్స్ సంబరాలు దోహదం చేస్తాయని అన్నారు. సైన్స్ ద్వారానే ఎంతో అభివృద్ధి సాధించామని, సైన్స్ మానవాళి సంక్షేమానికి ఉపయోగపడాలన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు టీఆర్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఏఐ ద్వారా వచ్చే మార్పులను గమనిస్తూ సమాజాభివృద్ధి కోసం కృత్రిమ మేధను ఉపయోగించాలని సూచించారు. జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాల ప్రభుత్వ పాఠశాలల విభాగంలో తాడికొండలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, చినకాకానిలోని జెడ్పీ హైస్కూల్, ఈమనిలోని జెడ్పీ హైస్కూల్, ప్రైవేటు పాఠశాలల విభాగంలో భాగంలో కొండవీడు పబ్లిక్ స్కూల్, సరోజినీ విద్యాలయం, లయన్ మాంటిసోరి స్కూల్ వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ఉదయభాస్కర్, టి.జాన్ బాబు, చెకుముకి కన్వీనర్ బి.ప్రసాద్, జి.వెంకట్రావు, డాక్టర్ ఏ.సత్యనారాయణ ప్రసాద్, షేక్ అహ్మద్ హుస్సేన్, టీఆర్ చాందిని, ఆర్.స్వాతి, ఎస్‌ఎం సుభానీ, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


