సభాసుపాలు | - | Sakshi
Sakshi News home page

సభాసుపాలు

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

సభాసుపాలు

డ్వాక్రా మహిళలకు ఇక్కట్లు

విజ్ఞాన మందిరం గేట్లకు తాళాలు.. బయటకు పోనివ్వకుండా అడ్డగింత

చిన్న పిల్లలతో అల్లాడిపోయిన డ్వాక్రా మహిళలు

అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం

రూ.527 కోట్లతో పట్టణాభివృద్ధి పనులు

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్‌గా పాల్గొనే ముఖ్యమైన కార్యక్రమం.. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అంతా హాజరైన వేళ.. అయితే సభలో జనం అంతంతమాత్రమే.. సుదీర్ఘ ప్రసంగాలు వినే ఓపిక లేక వారు సైతం వెళ్లిపోతున్న పరిస్థితి. వీటన్నింటిని గమనించిన అధికారులు పరువు కాపాడుకునేందుకు నిర్బంధమే ఆయుధంగా ఎంచుకున్నారు. ఇంకేం సభ జరుగుతున్న వేదిక ముఖ ద్వారానికి తలుపులు బిగించి, తాళాలు వేశారు. దీంతో గంటలు గంటలు లోపల కూర్చోలేక.. బయటకు రాలేక డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చిన్న పిల్లలతో సహా వచ్చిన మహిళలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం వర్చువల్‌గా పాల్గొన్న సభ ఏర్పాట్లను సైతం సరిగా నిర్వహించలేని అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నెహ్రూనగర్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌ కార్యక్రమానికి జనం కరువవడంతో అధికారులు అడ్డదారులు తొక్కారు. వచ్చిన కొద్దిపాటి డ్వాక్రా మహిళలు, ఆర్‌పీలు సైతం బయటకు వెళ్లిపోకుండా ఏకంగా ప్రాంగణం గేట్లు మూసివేసి నిర్బంధించిన అమానవీయ ఘటన మంగళవారం గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రూ.527 కోట్లతో చేపట్టనున్న పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ముఖ్యమంత్రి వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఈ సభకు భారీగా జనాన్ని తరలించాలని మెప్మా సీఓలు, సీఎంఎంలు, ఉపా సెల్‌ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. పరువు కాపాడుకునేందుకు జీఎంసీ, సచివాలయ ఉద్యోగులను హడావుడిగా రప్పించి కూర్చోబెట్టారు.

పిల్లలతో వెళ్లి బతిమాలినా కనికరించని వైనం

మరోవైపు సభకు అరకొరగా వచ్చిన డ్వాక్రా మహిళలు, ఆర్‌పీలు బయటకు వెళ్లిపోతుండటంతో అధికారులకు చెమటలు పట్టాయి. దీంతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి విజ్ఞాన మందిరం ప్రధాన ద్వారాలు, చుట్టూ ఉన్న గేట్లను దగ్గరుండి మూయించేశారు. ‘చంటిపిల్లలతో వచ్చాం.. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు.. ఇబ్బందిగా ఉంది.. దయచేసి బయటకు పంపండి‘ అని మహిళలు వేడుకున్నా అధికారులు కనికరించలేదు. సీఎం కార్యక్రమం పూర్తయ్యే వరకు ఒక్కరినీ బయటకు పోనిచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో సిబ్బంది, అధికారుల తీరుపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను తమపై రుద్ది, ఇలా గదుల్లో బంధించి వేధిస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు సిబ్బందికి, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది.

సీఎం కార్యక్రమానికి జనం రాకపోవడంతో అధికారుల దౌర్జన్యం

నెహ్రూనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగంగా గుంటూరు జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రూ.527 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సభలో కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌ వర్మ, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మహమ్మద్‌ నజీర్‌ అహ్మద్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం) ద్వారా జిల్లాలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కేటాయించినట్లు కలెక్టర్‌ తెలిపారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌కు రూ.250 కోట్లు, గుంటూరు నగరపాలక సంస్థకు రూ.205 కోట్లు, తెనాలి మున్సిపాలిటీకి రూ.44 కోట్లు, పొన్నూరు మున్సిపాలిటీకి రూ.28 కోట్లు కేటాయించారు. నగరంలో రోడ్లపై వేలాడుతున్న కేబుళ్ల సమస్యకు పరిష్కారంగా పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఒక మోడల్‌ రోడ్డును ఎంపిక చేసి ‘అండర్‌ గ్రౌండ్‌ డక్ట్స్‌’ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement