వరుసగా సినిమాలు
24న ‘కిన్నెర–బాలు పురస్కారం’ ప్రదానం
తెనాలి: మాధవపెద్ది సురేష్... ప్రముఖ సినీ సంగీత దర్శకుడు. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అరవై సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. తన సంగీత మాధుర్యంతో ప్రేక్షకులను ‘బృందావనం’లో విహరింపజేసి, ‘భైరవద్వీపం’లో పరవశుల్ని చేశారు. పదికాలాలు నిలిచే సంగీతం అందించటమే కాదు... వందకు పైగా ప్రైవేటు ఆల్బమ్‌లు విడుదల చేశారు. అన్నమాచార్య కీర్తనలు సరేసరి! దేశవిదేశాల్లో వందలాది సంగీత కచేరీలు చేశారు. ఈ నెల 20వ తేదీన ఒంగోలులో అక్కినేని కళాపరిషత్‌చే అక్కినేని అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడి రవీంద్రభారతిలో ఈ నెల 24న జరిగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరో వర్ధంతి సభలో ‘కిన్నెర–బాలు పురస్కారం’ స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మాధవపెద్ది సురేష్ సంగీత ప్రస్థానం...
తనదైన ముద్ర
తెలుగు సినిమారంగంలో మాధవపెద్ది వంశీయులు పలువురు తమదైన ముద్ర వేశారు. నటనలో అభినవ దుర్యోధనుడు మాధవపెద్ది వెంకట్రామయ్య, ‘మాయాబజార్’ సృష్టికర్త గోఖలే, ‘వివాహ భోజనంబు’ రుచి చూపించిన గాయకుడు సత్యం, సౌండ్ ఇంజినీరు/నటుడు శివరామ్, ‘దీక్ష’ హీరో రామ్‌గోపాల్, బాలకృష్ణకు తొలి సినిమా నుంచి ‘దానవీరశూర కర్ణ’ వరకు పాటలు పాడిన రమేష్ మాధవపెద్ది వారేనని తెలిసిందే. ఆ వారసుల్లో ఒకరు సురేష్. పూర్తి పేరు మాధవపెద్ది నాగసాయి సురేష్‌చంద్ర. సొంతూరు పొన్నూరు సమీపంలోని బ్రాహ్మణకోడూరు. 1951 సెప్టెంబరు 8న జన్మించారు. తండ్రి నాగేశ్వరరావు డాల్డా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేశారు. తల్లి వసుంధరాదేవి. కళాదర్శకుడు గోఖలే, గాయకుడు సత్యం ఇద్దరూ నాగేశ్వరరావు సోదరులే. సురేష్ అన్నయ్య గాయకుడు రమేష్.
ఆ ఘనత ఆయనదే...
తండ్రి ఉద్యోగం కారణంగా విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో చదివిన సురేష్‌కు, జంధ్యాల, ఎంవీ రఘు, తోటపల్లి సాయినాథ్, తోటపల్లి మధు, సుత్తి వీరభద్రరావు సహాధ్యాయులు. చదువు పూర్తయ్యాక స్నేహితులంతా సినిమాలు చేస్తున్నారు. అన్నయ్య రమేష్ కచేరీలు చేస్తూ ప్లేబ్యాక్ సింగర్ అయ్యారు. కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో డబుల్ డిప్లొమా చేశారు. ‘తాతమ్మ కల’, ‘వేములవాడ భీమకవి’, ‘రామ్‌రహీం’, ‘దానవీరశూర కర్ణ’ తదితర సినిమాల్లో పాడారు. మహమ్మద్ రఫీతో కలిసి తెలుగులో పాడిన ఏకై క సింగర్ ఘనత కూడా రమేష్‌దే. బీఏ తర్వాత అన్నయ్య సూచనపైనే సురేష్ ఎకార్డియన్ ప్లేయర్‌గా సాధన చేశారు. కొంతకాలం బ్యాంకులో ఉద్యోగం చేశారు. వేసవి సెలవుల్లో కుటుంబమంతా చైన్నెలో నెలరోజులు గడిపేవారు. ఇల్లంతా సినిమా సందడి ఉండేది. సంగీత దర్శకుడు టి.చలపతిరావు రమేష్, సురేష్‌లిద్దరినీ సినీరంగానికి పరిచయం చేశారు. చంద్రమోహన్, లక్ష్మి జంటగా కె.హేమాంబరధరరావు 1974లో తీసిన ‘పరివర్తన’ సినిమాకు ఎకార్డియన్ ప్లేయర్‌గా చేశారు సురేష్. తర్వాత కీబోర్డు ప్లేయర్‌గా వివిధ భాషల్లో 1,300 సినిమాలకు పనిచేశారు. కాలేజీ మిత్రుడైన జంధ్యాల సినీదర్శకుడయ్యారు. ఆయనే సురేష్‌కు సంగీత దర్శకత్వ అవకాశం కల్పించారు. ‘హై హై నాయకా’ సినిమాకు ‘ఇది సరిగమలెరుగని రాగం’ అనే పాటను 1988 ఆగస్టు 21న ఏవీఎం రికార్డింగ్ థియేటర్‌లో రికార్డు చేశారు.
బుల్లితెరపైనా...
చేతిలో ఏడెనిమిది సినిమాలు చేస్తుండగానే 1997లో టీవీ రంగంలోకి ప్రవేశించారు సురేష్. పలు సీరియల్స్‌కు సంగీత సహకారం అందించారు. మరోవైపు స్టేజ్ షోలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ వంశం నుంచి అయిదో తరం సినిమాల్లోకి వచ్చిందని సురేష్ ‘సాక్షి’తో చెప్పారు. సురేష్ కుమార్తె నాగలక్ష్మి కుమారుడు శ్యామ్‌సుందర్ బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు. ‘మార్గళి తింగళ్’ అనే తమిళ సినిమాతో రెండేళ్ల క్రితం సినీరంగానికి పరిచయమయ్యాడు. మరో తెలుగు సినిమా విడుదల కావాల్సి ఉండగా, ఇంకో రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నాడని తెలియజేశారు.
అక్కడి నుంచి అవకాశాలు వరుసబెట్టాయి. ‘భృందావనం’, ‘ఆవిడే శ్యామల’, ‘భైరవద్వీపం’, ‘మాతో పెట్టుకోకు’, ‘శ్రీకృష్ణార్జున విజయం’, మల్లెమాల బాలతారలతో తీసిన ‘రామాయణం’, రాజేంద్రప్రసాద్ ‘మేడమ్’, సూపర్‌స్టార్ కృష్ణ ‘పుట్టింటి గౌరవం’ తదితర 60 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. అన్నీ సంగీత దర్శకుడిగా సురేష్‌ను ఒక్కొక్క మెట్టు ఎదిగేలా చేశాయి. ‘భైరవద్వీపం’ సినిమాకు పట్టుబట్టి ‘శ్రీతుంబుర నారద నాదామృతం’ పాటను ప్రత్యేకంగా నెలరోజులపాటు కూర్చుని స్వరపరచారు. ఎస్పీ బాలు అద్భుతంగా పాడారు. ఈ పాటతో అగ్రశ్రేణి సంగీత దర్శకుల జాబితాలో చేరారు. పెండ్యాల, ఇళయరాజా, హిందీ సంగీత దర్శకులు నౌషాద్, లక్ష్మీకాంత్–ప్యారేలాల్ వంటి మూడు తరాల సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. సురేష్ సంగీత దర్శకత్వం వహించిన ‘భార్గవ్’ సినిమాకు ఏఆర్ రెహమాన్ కీబోర్డు ప్లేయర్‌గా చేశారు.


