గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రభుత్వం తమ న్యామమైన డిమాండ్లు పరిశీలించాలని కోరుతూ జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిలబడి పాటలు పాడి మంగళవారం వినూత్న తరహాలో నిరసన గళం వినిపించారు. చుక్కల్లోకి ఎక్కినాయి రెగ్యులర్ పోస్టులు... ఎప్పటికీ కాంట్రాక్ట్ వారికి అందనంతగా.... నిన్ను గెలిపించింది మా ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తావని , కాపాడు చంద్రన్న, కాపాడు పవనన్న, కాటికి పోయే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగాలేనా.... కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలంటూ పేరడీ సాంగ్‌ను ఆలపించారు. వినూత్న నిరసనలో కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సులు రమాదేవి, రేణుక, నూరి, పద్మావతి, లక్ష్మీ కుమారి, వాసు, ఫార్మాశిస్టులు నాగుల మీర, శ్రావణి, పావని, చంద్రకళ, ల్యాబ్ టెక్నీషియన్లు చారి, ఖాసిం, శైలజ, మోహన్, సుధశ్రీ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆగమ, వైదిక సంప్రదాయాలను అనుసరించి ఆలయ అర్చకులు, వేద పండితులు మంగళవారం పలు విశేష క్రతువులను నిర్వహించారు. ఉదయం అగ్నిమధనం, పంచగవ్యారాధన, పంచగవ్యప్రాశన, పంచాగ్ని ప్రణయనం, ఉక్తహోమాలు నిర్వహించారు. అనంతరం పవిత్రములతో స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించి మంగళహారతి సమర్పించారు. సాయంత్రం నిత్యహోమం, దిక్సూక్త హోమం, నవగ్రహ హోమం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రసాద గోష్ఠి, న్యాసం కార్యక్రమాలు జరిగాయి. రాత్రి పవిత్రముల శయనాధివాసం నిర్వహించడంతో మంగళవారం నాటి పవిత్రోత్సవ కార్యక్రమాలు ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్రోత్సవ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రానున్న దసరా, దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.


